(Source: ECI/ABP News/ABP Majha)
Tirupati News: స్వచ్ఛంద పదవీ విరమణ అంటేనే ఏపీలో ఉద్యోగులు భయపడే పరిస్థితి: ఫణి పేర్రాజు
Tirupati News: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ జేఎసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
Tirupati News: రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పిరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన కార్యాచరణపై తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు చేసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇంత వరకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఇక మీదట ఉద్యోగులను పదవీ విరమణ చేయరేమోనన్న ఆలోచనలో ఉన్నామని అన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ అంటేనే ఉద్యోగులు భయపడే పరిస్థితికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చేది భిక్ష కాదని, మన హక్కులను పరిరక్షించడానికి ముందుకు రావాలని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగస్తులందరూ ఒకే తాటిపై ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన ఏపీ జేఏసీ..
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకున్నా ఇంత వరకు ఓపికతోనే భరించామని, ఇక భరించలేమని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగులు చేపట్టే ఉద్యమాల వల్ల ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలిగినా...దానికి ప్రభుత్వానిదే పూర్తి బాద్యత అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్దితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోవటం దారుణమని వీరంటున్నారు.
చెప్పింది వింటున్నారే తప్ప సమస్యలు తీర్చట్లేదు..
కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం గతంలో మేము ఎన్నడూ చూడలేదని ఏపీ జేఏసీ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నరు. కుటుంబ అవసరాల కోసం డబ్బులు మాకు చెల్లించండి మహాప్రభో అని వేడుకుంటున్నా , మా మొరను ఆలకిస్తున్నారు గాని పరిష్కరించే నాధుడే కనిపించడంలేదని తెలిపారు. దాచుకున్న డబ్బులు కూడా మా అవసరాలకు మాకు ఇవ్వని కారణంగా, ఆడపిల్లలు పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకోవల్సిన పరిస్థితులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైనా సందర్బాలలో కూడా మెరుగైన చికిత్స చేయించుకోలేని దుర్బరమైన పరిస్దితులలో ఉద్యోగులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో పిల్లల చదువుల ఫీజులు కట్టలేక స్కూలు, కాలేజ్ యాజమాన్యాలు, పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఏర్పడిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బ్యాంక్ లో సకాలంలో వాయిదాలు కట్టలేకపోతుంటే, వడ్డీల మీద వడ్డీలు తమ ఖాతాలో నుండి డెబిట్ అవుతున్నాయని, ఇలాంటి దారుణమయిన పరిస్దితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తమ బాధలు పదే పదే చెప్తున్నా, ప్రభుత్వంలో ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితే లేదని, తప్పనిసరి పరిస్దితుల్లో గత్యంతరం లేక ఉద్యమానికి సిద్దపడాల్సి వస్తుందని వారు వెల్లడించారు.