Tirupati: తిరుపతి కిడ్నాప్ కేసులో నిందితుడి లొంగుబాటు - తల్లిదండ్రుల వద్దకు బాలుడు
చెన్నై కు చెందిన ఆలూరు మురుగన్ అనే రెండు సంవత్సరాలు వయసు కలిగిన బాలుడు రాత్రి తిరుపతి బస్ స్టేషన్ లో కిడ్నాప్ కు గురయ్యాడు
తిరుపతి బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఏర్పేడు పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్రం కోరసేవరం చెన్నై కు చెందిన ఆలూరు మురుగన్ అనే రెండు సంవత్సరాలు వయసు కలిగిన బాలుడు రాత్రి తిరుపతి బస్ స్టేషన్ లో కిడ్నాప్ కు గురయ్యాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన అవిలాల సుధాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఏర్పేడు మండలం మాధవ మాల గ్రామంలో ఉన్న తన అక్క ధనమ్మ ఇంటికి బాలుడిని తీసుకెళ్లాడు. వేరే వాళ్ళు డబ్బు ఇవ్వాలని.. అక్కడికి వెళ్లి తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
ధనమ్మ ఈ సందర్భంగా తమ్ముడు అవిలాల సుధాకర్ ని ఈ బాలుడు ఎవరు అని ప్రశ్నించింది. తన స్నేహితుడు కుమారుడని నీ దగ్గరనే ఉంచుకోమని చెప్పి అవిలాల సుధాకర్ అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. ఈరోజు (అక్టోబరు 3) మంగళవారం ఉదయం ధనమ్మ ఇంటిముందు ఆడుతున్న రెండేళ్ల బాలుడిని గ్రామస్తులు చూశారు. ఆ బాలుడి గురించి టీవీల్లో కిడ్నాప్ అనే వార్త వస్తుండగా, అది చూసిన గ్రామస్తులు తప్పి పోయిన బాలుడిగా ఉన్నాడని గుర్తించారు. ఈ విషయాన్ని మాధవ మాల సర్పంచ్ కరీముల్లా కు గ్రామస్తులు తెలపడంతో ఆయన వెళ్లి ధనమ్మను అడగగా ఆమె తడబడుతూ సమాధానం చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన కరీముల్లా వెంటనే ఏర్పేడు పోలీసులకి సమాచారం అందించారు. ఏర్పేడు సీఐ శ్రీహరి తన సిబ్బందితో వెళ్లి రెండేళ్ల బాలుడితో పాటు ధనమ్మను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.