Tirupati Assembly Constituency : టీడీపీ- జనసేన కూటమి నుంచి తిరుపతిలో పోటీ చేసేది ఎవరు? అధికార పార్టీకి గెలుపు కేక్‌వాక్ అవుతుందా?
Tirupati Assembly Constituency : తిరుపతి నియోజకవర్గంలో బలిజల ఓట్లు అధికంగా ఉన్నాయి. వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి టికెట్ ఎవరికి ఇస్తుందనే ఆసక్తి నెలకొంది.
Tirupati Assembly Constituency : కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది ఎంత ఆసక్తి రేకెత్తించిందే అంతకు రెట్టింపు తిరుపతి సీటు ఎవరిది అనేది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. తిరుపతి వేదికగా రాష్ట్ర రాజకీయం నిలిచిందనే చెప్పాలి.
తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని కావడంతో ఇక్కడ సీటు సాధించిన వారికి రాష్ట్రంతోపాటు దేశంలో మంచి గుర్తింపు ఉంటుందనేది నిజం. ఇలాంటి ప్రాంతంలో అధికార వైసీపీ(YSRCP) ప్రస్తుత ఎమ్మెల్యే, టీటీడీ(TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) తన తనయుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి(Abhinay Reddy)కి సీటు వచ్చేలా చేసుకున్నారు. డిప్యూటీ మేయర్‌గా తాను నగరానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కొత్త వర్సన్‌లాంటి వాడిని అప్డేట్ చేసుకోవాలని అంటూ అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
తన తండ్రి వెంట నడిచిన కొందరు నాయకులు అభినయ్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నా వారి లెక్కచేయకుండా తన ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. యువ నాయకులను పార్టీలోకి తీసుకుని ప్రతి అంశంపై లోతుగా ఆలోచన చేసి గెలిచిన వెంటనే అది పరిష్కారించేలా చేస్తామని అంటున్నారు.
సీటు పవన్ కేనా...
టీడీపీ-జనసేన పొత్తుల్లో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయింపు చేసినట్లు టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇటీవల టీడీపీ అధిష్టానం సైతం తిరుపతిలోని ముఖ్యనాయకులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్‌ను పిలిచి సర్దిచెప్పారు. భారీ మెజారిటీతో గెలిపించి నామినేట్ పదువులు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. నిన్నటి వరకు టీడీపీ సీటు అంటూ ప్రచారం జరిగి ప్రస్తుతం జనసేనకు సీటు అనడంతో ఆశావాహులు జనసేనలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నాయకులు ఇప్పుటికే జనసేన అధినేత అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది.
జనసేన పార్టీలో కూడా తిరుపతి సీటు జనసేనకు అనడంతో కొత్త ఉత్సాహం నింపినట్లు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన చర్చలో అధినేత పవన్ వివరాలు తీసుకుని కొంత మంది నాయకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తిరుపతిలో రాజకీయ పరిస్థితి.. గతంలో చిరంజీవి గెలుపు.. వాటి ప్రభావం తిరిగి పడే ప్రమాదం ఉందా అని పలు అంశాలను చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ కాకుండా మరెవ్వరిని నిలబెట్టాలి.. నిలబెడితే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే చర్చలు నడిచాయి.
తిరుపతి శాసనసభ్యుడు జనరల్ క్యాటగిరి.. పార్లమెంటు సభ్యుడు ఎస్సీ క్యాటగిరిలోకి వస్తుంది. ప్రస్తుతం తిరుపతి ఎంపీ సీటు ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన గురుమూర్తికే వైసీపీ కేటాయించగా... టీడీపీ- జనసేన ఇంక ప్రకటన చేయలేదు. గతంలో టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఉండగా.. ఈ ఎన్నికల్లో వారు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ కలిసి వస్తే తిరుపతి ఎంపీ స్థానం అడిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రకటన వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.
బలిజలకే సీటు కావాలి
తిరుపతి నియోజకవర్గంలో బలిజల ఓట్లు అధికంగా ఉన్నాయి. బలిజ ప్రభావం గత ఎన్నికల్లో కూడా అధికార పార్టీపై చూపిందని అంటుంటారు. ఏ పార్టీ వారైన... తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం బలిజలకు ఇవ్వాలంటూ వివిధ బలిజ సంఘాల నాయకులు తీర్మానం చేసుకున్నారు. వైసీపీ నుంచి ఆ అవకాశం లేకపోవడంతో టీడీపీ- జనసేనకు తమ మద్దతు అంటూ ప్రకటన సైతం చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ఎన్నికలన డిసైడింగ్ చేసే వారిలో టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.
టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, జీతాలు పెంపు చేసినా అధికార పార్టీ వైపు చూడటం లేదనే విశ్లేషణ ఉంది. ఇటీవల జరిగిన టీటీడీ చైర్మన్ సన్మాన సభ కూడా ఉద్యోగుల్లేక ఇతర విభాగాల నుంచి కార్మికులను తీసుకొచ్చారు. ప్రభుత్వం సీపీఎస్, రావాల్సిన బీకాయిలపై కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వారికి చేయాల్సినది చేస్తే ఓట్లు పడే అవకాశం ఉంది. ఉద్యోగుల కంటే ఎక్కువ ఉన్నవారు విశ్రాంత ఉద్యోగులు. వారికి టీటీడీ తరపున ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం.. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక లేనట్టే అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ- జనసేన.. బీజేపీ సీటు కేటాయిస్తే రాజకీయం మరింత వేడెక్కుతుంది.