Tirumala News: తిరుమల టికెట్ల అవకతవకలపై టీటీడీ లోతైన విచారణ- దళారులను నమ్మొద్దని భక్తులకు సూచన
Tirumala News: శ్రీవాణి ట్రస్టు పేరుతో గత ప్రభుత్వ హయాంలో టికెట్ల విక్రయంలో అనేక అక్రమాలు జరిగాయని టీటీడీ అనుమానిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేస్తోంది.
Andhra Pradesh: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీవాణి ట్రస్ట్ విధానంపై నూతన ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయంతో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి)ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్‌కు రూ.10000 చెలిస్తే ఒక వ్యక్తి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. రూ.10వేలు కాకుండా టికెట్‌కు అదనంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంతో కోట్ల రూపాయలు శ్రీవారి ఆలయానికి విరాళంగా అందాయి. అదే టైంలో ఈ విధానంపై వివాదాలు కూడా అన్నే ఉన్నాయి.
ఈ ట్రస్ట్‌పై అనేక ఆరోపణలపై నూతన ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టింది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో సాంకేతికంగా ఆరోపణలుకు కారణమైన అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లు తగ్గించి సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఆలోచన చేశారు. గతంలో జరిగిన దర్శనాలకు సంబంధించి వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు టీటీడీ గుర్తించి వాటిపై నిఘా పెట్టింది. అటువంటి వాటినీ బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వార్డ్ చేసింది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది.
దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోంది. అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది.
మధ్యవర్తులతో ప్రమాదం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిరీక్షించే భక్తులకు మధ్యవర్తులు, దళారులు వివిధ రకాల మోసాలకు పాల్పడి భక్తులని మోసం చేస్తున్నారు. భక్తులకు తెలిసి కొన్ని జరుగుతుంటే తెలియకుండా చాల జరుగుతుండడం విశేషం. వీటిని తిరుమల దర్శనం సమయంలో విచారణలో బయటపడుతుంది.
అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్‌లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దళారుల పట్ల, మోసపూరిత వెబ్ సైట్లు, ఆన్ లైన్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.