TTD News: రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం- జులై నెలలో ఎంత వచ్చిందంటే!
TTD News: తిరుమల తిరుపతి దేవస్థానానికి జులై నెలలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. హుండీ కానుల రూపంలో భక్తుల నుంచి స్వామివారికి రూ.129.08 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
TTD News: తిరుమల తిరుపతి దేవస్థానానికి జులై నెలలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. హుండీ కానుల రూపంలో భక్తుల నుంచి స్వామివారికి రూ.129.08 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నామని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని తెలిపారు. భక్తులకు చెల్లించే రీఫండ్ సొమ్ము సమాచారాన్ని ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచన్నారు. తిరుమలలో యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతోందని చెప్పారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుంచి 5 రోజులు వేచి ఉండడం లేదని వివరించారు. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్ కోడ్ సబ్‌మిట్ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదని చెప్పారు.
శ్రీవారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
భక్తులకు ‘‘పే లింక్’’ ఎస్ఎంఎస్
సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు జూలై 19వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్ ద్వారా పేలింక్ పంపుతున్నట్లు ఈవో చెప్పారు. భక్తులు తిరిగి కౌంటరు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్ లేదా యుపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చని ఈవో వివరించారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుచేస్తామని చెప్పారు.
శ్రీవారి పుష్కరిణి మూత
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు ఈవో చెప్పారు.. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందు ఈ పనులు చేయడం ఆనవాయితీ అన్నారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదన్నారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి టీటీడీ సహకారం
తిరుపతి జిల్లాను క్యాన్సర్ రహితప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందని ఈవో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కోసం ఒక పింక్ బస్సును ఆధునిక వైద్యపరికరాలతో జిల్లా యంత్రాంగానికి విరాళంగా అందిస్తామన్నారు. అలాగే, గూడురు, చంద్రగిరి, శ్రీకాళహస్తిల్లో క్యాన్సర్ నిర్ధారిత కేంద్రాలకు మరో పింక్ బస్ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. అలాగే స్విమ్స్‌లో మరో పింక్ బస్ ఏర్పాటు చేస్తామన్నారు. టాటా క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఒక పింక్ బస్ అందిస్తామని చెప్పారు.
స్విమ్స్‌లో లివర్ మార్పిడికి శస్త్ర చికిత్సలు
స్విమ్స్‌లో త్వరలో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం రాష్ట్రంలో మరెక్కడా లేని హెచ్‌పీబీ (హెపటో పాంక్రియాటో బిలియరీ) సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తోందన్నారు. ఎయిమ్స్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారని తెలిపారు. 50 సీట్లు ఉన్నాయని వీరికి ప్రముఖ వైద్యులతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
జూలై నెలలో తిరుమలలో నమోదైన వివరాలు :
దర్శనం : శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 23.23 లక్షలు
హుండీ : హుండీ కానుకలు - రూ.129.08 కోట్లు
లడ్డూలు : విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 1.10 కోట్లు
అన్నప్రసాదం : అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 56.68 లక్షలు
కల్యాణకట్ట : తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 9.74 లక్షలు