Tirumala News: తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం గురించి తెలుసా! పూర్తి వివరాలతో స్పెషల్ స్టోరీ
Tirumala News: తిరుమల లో ప్రతి రోజు ఇదొక కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా అనంత పద్మనాభ వ్రతం నిర్వహించారు. ప్రతి ఏడాది ఇ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
Tirumala News: తిరుమల నిత్య కల్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది. తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం లో నిత్యం ఏదోక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాంతం లో శ్రీ మహా విష్ణువు పాన్పు గా ఉన్న ఆదిశేషుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆయన వ్రతాన్ని నిర్వహిస్తారని తెలుసా...? తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం పై స్పెషల్ స్టోరీ...!
అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.
ఘనంగా పద్మనాభ వ్రతం
అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. తిరుమలలో మంగళవారం అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకువెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేసారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఆ తరువాత ఉదయం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని దంపతులు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
18న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.