Tirumala: తిరుమలకు వెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి మోసగాళ్లూ ఉన్నారు - వలలో పడితే అంతే!
ఏడుకొండలపై దళారుల నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టినప్పటికీ పలువిధాలుగా వారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు.
శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను కొత్త ఆలోచనలతో దళారులు మోసగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టెలిగ్రాంలో గ్రూపును ఏర్పాటు చేసి భక్తులకు దర్శన టోకెన్లను అధిక ధరలకు విక్రయిస్తూ జేబులను నింపుకుంటున్నారు కొందరు దళారులు. ఏడుకొండలపై దళారులను నిర్మూలనకు అనేక చర్యలు చేపట్టినప్పటికీ పలువిధాలుగా వారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. తాజాగా టెలిగ్రాం గ్రూపు ద్వారా దర్శన టిక్కెట్ల ధరలను కేటాయిస్తున్న వ్యవహారంను టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు. చాకచక్యంగా గ్రూపులో అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్న దళారిని టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భక్తుల వద్ద నుండి లక్షల రూపాయలు నగదు అకౌంట్ వేసుకుని దర్శనం కల్పించకుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తిరుమల టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా ఆసక్తి చూపుతుంటారు. క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడిని తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించాలని పరితపించి పోతుంటారు. ఇందు కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. అంతే కాకుండా ముందస్తుగా టిటిడి విడుదల చేసే దర్శన టికెట్ల కోసం ఎప్పటి నుంచో భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొంత మంది టిక్కెట్లు లభించక పోయేసరికి నిరుత్సాహానికి గురై, తెలిసిన వారితో దర్శన టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం నాలుగు కళ్ళతో వేచి చూసే కొందరు కేటుగాళ్ళు దర్శన టిక్కెట్లు ఇప్పిస్తామంటూ నమ్మించి నిలువునా దోచుకుంటున్నారు.
కడప జిల్లా వ్యక్తే
భక్తులను అమాయకులను చేసి ఆన్లైన్ వేదికగా టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్ల అమ్మకం వ్యవహారాన్ని కడప జిల్లా, యర్రగుంట్లకు చెందిన షేక్ మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి. యర్రగుంట్లలో షరీఫ్ "రిజ్ ఇంటర్ నెట్" పేరుతో ఆన్లైన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. నెలవారి టిటిడి విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జితసేవ టిక్కెట్లను బుక్ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా జేబు నింపుకుంటూ వచ్చేవాడు. అక్రమ సంపాదనకు బాగా అలవాటు పడిన షరీఫ్ నయా ఆలోచనతో TIRUMALA DARSHAN TICKETS TTD పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. తెలిసిన వారిని, తెలియని వారిని గ్రూపులో జాయిన్ చేశాడు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, ఆర్జిత సేవ, అంగప్రదక్షణ వంటి టిక్కెట్లకు అధిక ధర కేటాయించి వాటి ధరలను గ్రూపులో పోస్టు చేసేవాడు.
ఇలా దొరికిపోయాడు
అయితే వ్యవహారం నిజం అని నమ్మిన భక్తులు షరీఫ్ ను ఫోన్ ద్వారా సంప్రదించి నగదు జమ చేసారు. కానీ వారికి దర్శన టిక్కెట్లు కేటాయించకుండా ఉండడంతో కొందరు భక్తులు టిటిడి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన టిటిడి విజిలెన్స్ టెలిగ్రాం గ్రూపులో జాయిన్ అయ్యి తమకు దర్శనం కేటాయించాలని కోరి, ఫోన్ నెంబర్ ద్వారా షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చీటింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక తిరుమల శ్రీవారిని అత్యంత దగ్గర చూసే సేవల్లో అభిషేకం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవలు ఉన్నాయి. వీటిని ఎరగా చూపించి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులను నుండి లక్షల రూపాయలు దండుకున్నాడు చిత్తూరు నగరం సంతపేటకు చేందిన శరవణన్ అనే యువకుడు. రెండు అభిషేకం టిక్కెట్లు -4 లక్షలు, 3 తోమాల సేవ టిక్కెట్టు - 3 లక్షలు, అర్చన సేవకు - 80 వేల చొప్పున భక్తుల వద్ద నుండి వసూలు చేసి, భక్తులకు దర్శనం కేటాయించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజిలెన్స్ సిబ్బంది చిత్తూరులో అదుపులోకి తీసుకుని తిరుమలకు తీసుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు. ఇతనిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే దళారులను నమ్మి మోస పోవద్దని తిరుమల పోలీసులు భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు.