Tirumala News: తిరుమల అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ
Tirumala News: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దేవస్థానంలో అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ నిర్వహించినట్లు టీటీడీ ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala News: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్న ప్రసాద వితరణ జరగాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ.. అన్నప్రసాద భవనంలో ఆయుధపూజ నిర్వహించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఉదయం జరిగిన ఆయుధ పూజలో ఈవో పాల్గొన్నారు. అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్ర పటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేశారు. అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద భవనంలో సాంప్రదాయబద్ధంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
1983 నుంచి నిత్య అన్నదాన కార్యక్రమాలు..
దాతల సహకారంతో భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు అందిస్తూ, ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని ఎవి ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలో 1983 వ సంవత్సరంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. 2009లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం నిర్మించి.. ప్రతి రోజుకు దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా భక్తులకు అత్యద్భుతమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి రుచికరమైన భోజనాలు అందిస్తున్నామని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియ జేశారు. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడ కడుపు నింపుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ఘనంగా కార్తీక దీపోత్సన కార్యక్రమం..
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో.. మొదట శ్రీ యోగ నరసింహ స్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్లోలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ.. ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.
మంగళ వాయిద్యాల నడుమ 100 నేతి జ్యోతులు..
ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాముల వారిమేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజ స్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాకం అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీ వరాహ స్వామి ఆలయం, స్వామి పుష్కరిణి సుమారుగా 100 నేతి జ్యోతులను మంగళ వాయిద్యల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.