Tirumala News: తిరుమలలో ఐదోరోజు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు- సాయంత్రం గరుడ వాహన సేవ
Tirumala News: తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఐదో రోజు స్వామి వారు మోహినీ అలంకారంలో దర్శనం ఇచ్చారు.
Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అయితే ఔదో రోజులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనం ఇచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతారం - మాయా మోహ నాశనం
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయా మోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు కటాక్షిస్తారు.
గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నాడు.
నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు
గురువారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై తిరుమల వీధుల్లో వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో... వీధులన్నీ భక్త జనసాంద్రంగా మారాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా భక్తులకు అభయమించారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో కారైకాల్ కు చెందిన ' నాట్యాలయ భరతనాట్యం' బృందం కలైమామణి గురు డా. చిత్రాగోపీనాథ్ 15మందితో కూడిన తమ బృందంతో ప్రదర్శించిన "భరతనాట్య" ప్రదర్శన వీక్షకులను అలరించింది. ఈ నాట్య ప్రదర్శనలో - పురందరదాస కీర్తనలైన 'శరణు సిద్ధివినాయక, జగన్మోహననె కృష్ణ, జయజయవిఠల పాండురంగ, వేంకటరమణెనె బారో, 'బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం..' పాటలకు నర్తకీమణులు శ్రీనిధి, నిత్యశ్రీ, రియాశ్రీ, అనురాగ, దర్శనీ, జననీ, శ్రీలేఖ ప్రదర్శించిన హావభావాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం గోపీనాథ్ అందించారు. ఈ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు బృందం సమర్పించారు.