Tirumala News: తిరుమల నడక దారి భక్తులకు గుడ్ న్యూస్, శ్రీవారి దివ్య దర్శన టోకెన్లు జారీ
Tirumala News: త్వరలోనే నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌకర్యార్థం దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala News: త్వరలోనే నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌకర్యార్ధం దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఆలయ ఈవో ఏవీ.ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గోని భక్తులకు సలహాలు, సందేహాలను ఫోన్ ద్వారా నేరుగా తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి సంబందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేస్తామని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్టుకి విరాళం అందించిన భక్తులకు తిరుమలలోని ఏటీజీహెచ్, ఎస్ఎన్జీహెచ్ అతిథి గృహాల్లోని 88 గదులను కేటాయిస్తామన్నారు. అదేవిధంగా కాషన్ డిపాజిట్ విధానంపై మరొకసారి పూర్తి స్ధాయిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ నుండి తిరుమలలో ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి మాసంలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల ఆదాయం లభించగా.. 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 92.96 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా, 34.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించరన్నారు. 7.21 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు.
ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ..
తిరుమలలో మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. ఫొటో ఆధారిత బయోమెట్రిక్ అమలుతో దళారులకు అడ్డుకట్ట వేయనుంది. గదుల కేటాయింపు సమయంలో ఫొటో క్యాప్చర్ తీసుకుంటున్నారు. గదులు ఖాళీ చేసే సమయంలో క్యాప్చర్ అయినా ఫొటో మ్యాచ్ అయితేనే కాషన్ డిపాజిట్ అకౌంట్ లో జమ చేస్తారు. రూమ్ రొటేషన్ విధానం ఆగిపోవడంతో త్వరిత గతిన సామాన్య భక్తులకి గదులు త్వరగా అందించగలుతోంది. గతంలో దళారుల చేతివాటంతో గదుల రొటేషన్ విధానం సాగుతూ వచ్చిన.... ఇప్పుడు ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ద్వారా దళారులు గదులు పొందే అవకామే లేదు. ఉచిత లడ్డు జారీ విధానంలో సైతం ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ప్రవేశపెట్టామని, లడ్డు మిస్యూస్ కాకుండా ఉండేందుకు ఈ విధానం పనిచేయనుంది అధికారులు తెలిపారు.
15 రోజుల పాటు ప్రయోగాత్మక పరిశీలన
తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ అమలుతో అసలేన భక్తులు గదులు పొందుతున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దీంతో దళారులు తగ్గారన్నారు. తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం, సీఆర్వో, ఎంబీసీ ప్రాంతాల వద్ద భక్తులకు గదులను కేటాయించే కౌంటర్ల వద్ద ఈవో ధర్మారెడ్డి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని గురువారం పరిశీలించారు. మరో 15 రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలిస్తామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేందుకు త్వరలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా టోకెన్లు అందజేస్తా్మన్నారు. తిరుమలలో దళారులను పూర్తిగా తగ్గించేందుకు, టీటీడీ సౌకర్యాలు భక్తులకు అందించేందుకు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తిరుమలలో సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గదులను రొటేషన్ చేసే పద్ధతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని చెప్పారు. గదుల కోసం పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు తొందరగా రూములు దొరుకుతున్నాయని ఈవో తెలిపారు.