Tirumala Laddu Sales: తిరుమల లడ్డూకు మరింత డిమాండ్, నెయ్యి వివాదం తర్వాత అమ్మకాలు మరింత పైపైకి
Tirumala Laddu News: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డూ విక్రయాలు తగ్గి ఉంటాయని అందరూ భావించారు. కానీ, పరిస్థితులు మరోలా ఉన్నాయి. విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
Tirumala Sri Venkateshwara Swamy: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహా ప్రసాదమైన లడ్డూకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో పుణ్యంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిపోయిందన్న ఆరోపణలు వారి మనోభావాలను బాగా దెబ్బతీశాయి. లడ్డూ కోసం వినియోగించే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కల్తీ అయిందని, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె కలిసిందన్న రిపోర్టులు హిందువుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఏపీలో గత ప్రభుత్వం ఉండగా ఈ భారీ తప్పిదం జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. వారి హాయాంలోనే నెయ్యి కాంట్రాక్టర్‌లను మార్చడంతో ఈ వివాదం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది.
అయితే, తిరుమల లడ్డు చుట్టూ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డూ విక్రయాలు తగ్గి ఉంటాయని భావించినప్పటికీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. తిరుమల లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి. లడ్డూ విక్రయాలపై నెయ్యి వివాదం ప్రభావం చూపలేదని దీన్ని బట్టి అర్థం అవుతోంది. లడ్డూ తయారీలో అపశ్రుతులు జరిగినా.. శ్రీవారి లడ్డూను పరమ పవిత్రంగానే భక్తులు భావిస్తున్నారు.
గత నాలుగైదు రోజులుగా శ్రీవారి లడ్డూ వివాదం జరుగుతుండగా అనూహ్యంగా సెప్టెంబరు 19 నుంచి లడ్డూ విక్రయాలు పెరుగుతూ వచ్చాయి. 19వ తేదీన 3.59 లక్షలు, 20వ తేదిన 3.16 లక్షలు, 21 వ తేదీ 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు.
నెయ్యి కాంట్రాక్టర్ ను మార్చిన ప్రభుత్వం
తిరుమలకు సరఫరా చేస్తున్న నెయ్యి కాంట్రాక్టర్ గతంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ కాగా.. వారు సరఫరా చేసిన ఆవు నెయ్యిలోనే జంతు నూనెల అవశేషాలు ఉన్నట్లుగా ఎన్‌డీడీబీ రిపోర్టులో వెల్లడైంది. అయితే, తాము స్వచ్ఛమైన నెయ్యినే సరఫరా చేశామని ఏఆర్ ఫుడ్స్ చెబుతోంది. ఈ కల్తీ రిపోర్టులు వచ్చాయన్న కారణంతో ప్రస్తుత ప్రభుత్వం నెయ్యి కాంట్రాక్టర్ ను మార్చినట్లుగా ప్రకటించింది. అంతేకాక, లడ్డూ తయారీలో వాడే పదార్థాల నాణ్యతను కూడా మరింత పెంచామని, తద్వారా సువాసన, రుచి మరింత పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే ప్రసాదం - ఈవో
ప్రస్తుతం తిరుమలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు రెండు రోజుల క్రితం స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత పోటు కార్మికులతో మాట్లాడిన తరువాత, మొదటిసారిగా నెయ్యి శాంపుల్స్ ను పరీక్ష కోసం బయటి ల్యాబ్‌కు టీటీడీ పంపిందన్నారు.
ప్రస్తుతం టీటీడీకి ఐదు నెయ్యి సరఫరాదారులు ఉన్నారని అన్నారు. వారి ధరలు రూ. 320 నుండి రూ. 411 మధ్య ఉన్నాయని, వారి పేర్లు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏఆర్ డెయిరీ. ప్రాథమికంగా ఈ రేట్లతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. కల్తీ నెయ్యిని పరీక్షించడానికి నమూనాలను బయటి ల్యాబ్‌లకు పంపుతామని, కల్తీ అని తేలితే బ్లాక్‌లిస్ట్ చేయనున్నట్లు వారిని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్చరించిన తర్వాత కూడా, ఏఆర్ ఫుడ్స్ పంపిన 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు.