Tirumala Laddu: లడ్డూ వివాదంతో చంద్రబాబు కీలక నిర్ణయం- పోటు నుంచి నెయ్యి ఉంచే ప్రదేశాల వరకు సంప్రోక్షణ
Tirumala Laddu Issue: తిరుమల సంప్రోక్షణకు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడటంతో... శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలని అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు.
Tirumala Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని.. భక్తులు పవిత్రంగా భావిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకునే భక్తులు... లడ్డూ ప్రసాదం కోసం పోటీపడుతుంటారు. ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం.. తిరుమల లడ్డూను తింటే వస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలాంటిది...తిరుమల లడ్డూపై ఇప్పుడు నెలకొన్న వివాదం భక్తులను కలవరపెడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి వాడారన్న వార్త దావాలనంగా వ్యాపించింది. జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని టెస్టుల్లో తేలిందని నిన్న (శుక్రవారం) టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) కూడా స్పష్టం చేశారు. ఏఆర్ డెయిరీస్ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యికి సంబంధించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా... అందులో జంతు కొవ్వు కలిసినట్టు తేలిందన్నారు. ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపేశామని... ఏఆర్ డెయిరీస్ సప్లయర్స్‌ని రద్దు చేశామని చెప్పారు.
ఇక... తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సీరియస్‌గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరగడానికి వీల్లేదని... గట్టిగా చెప్పారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏపీ ముఖ్యమంత్రి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడకూడని పదార్థాలను వాడిన నేపథ్యంలో తిరుమల సంప్రోక్షణ జరపాలని నిర్ణయించారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం... తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని ఆదేశించారు చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అధికారులతో నిన్న (శుక్రవారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉన్న నెయ్యి వాడటంతో... తిరుమల అపవిత్రం అయ్యిందన్నారు. అందుకే... శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలన్నారు.
తిరుమల సంప్రోక్షను ముందుగా... లడ్డూ పోటు నుంచి ప్రారంభించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలన్నారు. అందుకుగాను ఆగమ, వైదిక శాస్త్రాల్లోని పద్దతులను అనుసరించాలని సూచించారు. అంతేకాదు... తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధివిధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా... ఆగమ, వైదిక శాస్త్ర పండితులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. లడ్డూ ప్రసాదాల తయారీలో జరిగిన అవకతవకలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు సీఎం చంద్రబాబు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీపడొద్దు ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను, తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు.
తిరుమల లడ్డూ వివాదంలో ఆరోపణలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీవ్రంగా ఖండించారు. నెయ్యిలో జంతు కొవ్వు ఉంది అన్నది కట్టు కథ అని కొట్టిపారేశారు. 100 పాలన పూర్తిచేసుకున్న కూటమి ప్రభుత్వాన్ని... హామీల గురించి ప్రశ్నించికుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చారని మండిపడుతోంది.
Also Read: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!