Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ, 20 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు
Crowd Of Devotes In Tirumala : వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది. 20 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఇక్కడ రద్దీ నెలకొంది. శనివారం ఒక్కరోజే శ్రీవారిని 69,332 మంది భక్తులు దర్శించుకోగా, ఆదివారం కూడా అంతే స్థాయిలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. శనివారం భక్తులు అందించిన కానుకలు ద్వారా శ్రీవారికి హుండీకి రూ.3.22 కోట్లు రూపాయలు ఆదాయం సమకూరింది. ఆదివారం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు 20 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు సమయం పడుతోంది. గడిచిన రెండు, మూడు రోజులు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల కొండ రద్దీగా మారింది. వేలాది మంది భక్తులతో కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు నీళ్ల సదుపాయంతోపాటు చిన్నారులకు అవసరమైన పాలు అందిస్తున్నారు. మరో రెండు రోజులు భక్తుల రద్దీ కొనసాగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
దర్శనం కోసం సుమారు 70 వేల మంది
తిరుమలలో 20 కంపార్ట్‌మెంట్లలో సుమారు 70 వేల మంది వరకు భక్తులు వేచి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సర్వ దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటలు సమయం పట్టే అవకాశముంది. రూ.300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి ఐదు గంటల్లో పూర్తవుతోంది. గడిచిన రెండు రోజులు నుంచి ప్రతిరోజూ 60 వేల మందికిపైగా భక్తులు దర్వనం చేసుకుంటున్నారు. శని, ఆదివారాలతోపాటు సోమవారం కూడా ఈ తాకిడి ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భారీగా వచ్చిన భక్తులతో అద్దె గదుల కొరత కూడా ఏర్పాటైంది. దీంతో వేలాది మంది శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న షెడ్డులోనూ, బయట కొందరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలోనే పలు ప్రాంతాల్లో భక్తులు సేదతీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నదాన కాంప్లెక్స్, ఇతర ప్రాంతాల్లోనూ రద్దీ ఎక్కువగా కనిపించింది.