Tirumala News: టీటీడీ ఛైర్మన్ గా భూమన ప్రమాణ స్వీకారం - వారే నా తొలి ప్రాధాన్యమని వెల్లడి
Tirumala News: గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ నూతన పాలక మండలి ఛైర్మన్ గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు.
Tirumala News: టీటీడీ నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం ముందుగా తిరుమలకు చేరుకున్న భూమన కరుణాకర్ రెడ్డి క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరహాస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని ధ్వజ స్తంభంకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేసిన భూమన.. ముందుగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం పొందారు. అనంతరం 11:36 గంటల నుండి 12:44 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ నూతన పాలక మండలి ఛైర్మన్ గా భూమన కరుణాకర్ చేత టీటీడీ ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ పాలక మండలికి సంబందించిన పత్రాల్లో టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఆ తర్వాత తిరిగి మరొక సారి శ్రీనివాసుడి ఆశీస్సులు పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. ఈక్రమంలోనే టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి భుమన కరుణాకర్ రెడ్డికి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు, చిత్ర పటాన్ని అందించారు.
వారే నా తొలి ప్రాధాన్యం
సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత అని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం శ్రీవారి సన్నిధిలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్ గా భుమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠ నాధుడు దర్శనార్ధం తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకే తాను మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ధనవంతులకు ఊడిగం చేయడానికో, వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చెప్పట్ట లేదని ఆయన స్పష్టం చేశారు. హిందూ ధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తాం అన్నారు. దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదని, స్వామి భక్తుడిని అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అని చెప్పారు.
టీటీడీ చైర్మన్ గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఎక్కువ సమయం స్వామి వారిని దర్శించుకోవాలన్న కోరిక సమంజసం కాదన్నారు. కోట్లాది మంది టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తూ ఉంటే, సామాన్య భక్తుడినైన తనను స్వామి వారు అనుగ్రహించారన్నారు. నాలుగు సంవత్సరాలు పాలక మండలి సభ్యుడిగా ఉన్న నాలుగు సార్లు కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లలేదని తెలియజేశారు. సామాన్య భక్తుడిలాగే స్వామి వారిని మహలఘు విధానంలో అనేక సార్లు దర్శించుకున్నట్లు ఆయన తెలియజేశారు. భక్తులకు దర్శనం చేయించడమే కాకుండా భక్తుల వద్దకే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకు వెళ్తానన్నారు. చిన్న సమస్య కూడా లేకుండా రోజుకి 85 వేల మంది భక్తులకు దర్శనం చేయిస్తున్న ఆలయం తిరుమల పుణ్యక్షేత్రం ఒక్కటేనని ఆయన గుర్తు చేశారు. తాను దర్శనాలు చేసుకోవడానికి, దర్శనాలు చేయించడానికి అధ్యక్షుడిని కాదని చెప్పిన ఆయన, సామాన్య భక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు పాలక మండలిలో తీసుకుంటామని పేర్కొన్నారు.
సామాన్యుడి వైపు టీటీడీ ఉద్యోగులు వైపు ఉంటానని తెలియజేశారు. దివంగత సీఎం వైఎస్ రాజేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్ రెడ్డి ఇద్దరి హయాంలోనూ పాలక మండలి అధ్యక్షుడిగా పని చేసే అరుదైన అవకాశం నాకు ఒక్కడికే వచ్చిందని టీటీడీ పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ తెలియజేశారు.