Tirumala: బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు, వైకుంఠ ఏకాదశికి 7 లక్షల దర్శన టికెట్లిస్తాం: టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి
Tirumala: ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.
Tirumala: ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదని.. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ ఉంటుందని చెప్పారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నెల 19న కనుమ దారిలో ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేధించినట్లు చెప్పారు. 20న పుష్పక విమానం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదని చెప్పారు.
53.84 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేశామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే తిరుమలలో సామాన్య భక్తులకు తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజానికి రెండు హోటళ్లు కేటాయించినట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలకు అన్నప్రసాదం విక్రయిస్తున్నారనే భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో స్థానిక అన్నమయ్య భవనం, నారాయణగిరి హోటళ్లను ఏపీ టూరిజానికి అప్పగించినట్లు చెప్పారు. రెండు చోట్లా పని తీరును గమనించిన తర్వాత మరికొన్ని హోటళ్లను కేటాయించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
జనతా హోటళ్లలో అధిక ధరలకు అన్నప్రసాదాలు విక్రయించినట్లు ఫిర్యాదు అందితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు దర్శనానికి వీలుగా 2 లక్షల టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్ లో విడుదల చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజుల వ్యవధిలో ఆఫ్‌లైన్ లో 5 లక్షల టికెట్లను ఇస్తామన్నారు.
ఈ నెల 29వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని 28వ తేదీన రాత్రి 7.05 గంటల నుంచి మరుసటి రోజు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటల వరకు మూసి వేస్తామని చెప్పారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో కొత్తగా వేదాశీర్వచనం, కుంకుమార్చన సేవలను ప్రవేశపెట్టామని, టీటీడీ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు
14న అంకురార్పణ జరుగుతంది. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుందన్నారు.
గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందని, భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుందని ఈఓ పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని, బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు.
భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుంచి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదని. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా ఉంటుందని ధర్మారెడ్డి వెల్లడించారు. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా అధిక రద్దీ దృష్ట్యా, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేశామని. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీలలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవన్నారు. అక్టోబర్ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు.
ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి వేస్తారని ఈఓ అన్నారు. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదని భక్తులు గుర్తించాలని కోరారు. అక్టోబర్ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు- వంద కోట్లు దాటిన ఆదాయం
గత సెప్టెంబర్ నెలలో తిరుమలలో శ్రీవారిని 21 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు. గత నెలలో శ్రీవారికి హుండీ కానుకల రూపంలో రూ.111.65 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 53.84 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 8.94 లక్షల మంది శ్రీ వారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఈవో వెల్లడించారు. కోటి 11 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని ఈవో ధర్మారెడ్డి మీడియాతో చెప్పారు