Sri Padmavati Ammavari Brahmotsavalu: గరుడ వాహనంపై సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనం Photos
Tiruchanur Padmavathi Ammavari Brahmotsavam 2024 | తిరుచానూరు పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాల ఆరోరోజు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు. స్వామి వారి బంగారు పాదాలు దర్శించి ఊరేగారు.
Tiruchanur Sri Padmavathi Ammavari Brahmotsavam | తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
గరుడసేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నపుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి.
శ్రీవారు, అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఉడిపి పి పెజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ, ఈవో శ్యామల రావు, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read: Sabarimala Red Alert: శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లోకి నో ఎంట్రీ !