Hyderabad: హైదరాబాద్‌లో బాలుడి అదృశ్యం కేసులో ట్విస్ట్- తిరుమలలో ఆచూకీ లభ్యం- శ్రీవారి దర్శనానికి వచ్చినట్టు వెల్లడి
Tirupati: హైదరాబాద్‌లో మిస్ అయిన బాలుడు తిరుపతిలో దొరికాడు. అడిగితే తాను తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చానని చెబుతున్నాడు.
Andhra Pradesh: హైదరాబాద్‌లో కనిపించకుండా వెళ్లిపోయిన బాలుడు కేసు కీలక మలుపు తిరిగింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమైన బాలుడు ఇప్పుడు తిరుపతిలో దర్శనమిచ్చాడు. తాను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చానని చెబుతున్నాడు.
హైదారాబాద్ మీర్ పేటకు చెందిన బాలుడిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు. ఆ బాలుడిని విచారిస్తే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చానని చెబుతున్నాడు. ఇంట్లో వాళ్లతో మాట్లాడించిన పోలీసులు బాలుడిని చైల్డ్ హోంకు తరలించారు. కన్నవారితో చర్చించిన పోలీసులు కర్నూలు నుంచి వచ్చే బంధువులకు బాలుడిని అప్పగించనున్నారు.
హైదరాబాద్‌లో ఉంటున్న బాలుడు రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో కన్నవాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందజేశారు.
బాలుడి వివరాలు సమాచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కొందరు వ్యక్తులు బాలుడు ఒంటరిగా తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడితో మాట్లాడిన పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో తప్పిపోయిన బాలుడిగా నిర్దారించుకున్న తర్వాత కుటుంబానికి సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన బాలుడు తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కడే వచ్చాడా ఎవరైనా తీసుకొచ్చారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.