Chittoor: కలర్ టీవీలు, కూలర్లకి ఊళ్లో శవయాత్ర, శ్మశానంలో అంత్యక్రియలు - ఎందుకో తెలుసా?
Chittoor: కలర్ టీవీ, కూలర్లు, ఏసీలు, ప్రిడ్జ్, ఫ్యాన్లకు శవ యాత్ర చేశారు. ఆ సందర్భంగా డప్పులు వాయిద్యాలు వాయించారు. టీడీపీ నాయకులు డాన్సులు చేస్తూ నిరసన తెలిపారు.
Chittoor TDP Leaders Protest: రాష్ట్రంలోని వైసీపీ సర్కారు ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందని.. ధగాకోరు ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జనాలు ఎదుర్కొంటున్న కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీలు పెంపుదలకు నిరసనగా ఆదివారం చిత్తూరులో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కలర్ టీవీ, కూలర్లు, ఏసీలు, ప్రిడ్జ్, ఫ్యాన్లకు శవ యాత్ర చేశారు. ఆ సందర్భంగా డప్పులు వాయిద్యాలు వాయించారు. టీడీపీ నాయకులు డాన్సులు చేస్తూ నిరసన తెలిపారు. ఊరి నుంచి టీవీలు, కూలర్‌లను పాడెపైన ఉంచి.. వాటిని ఊరి నుంచి శ్మశానానికి తీసుకెళ్లి చితిపై ఉంచి నిప్పటించారు. అచ్చం మనిషికి అంత్యక్రియలు చేసిన తరహాలోనే ఎలక్ట్రిక్ వస్తువులకు కూడా తలకొరివి పెట్టి విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజురు బాలాజీ మాట్లాడుతూ కరెంటు కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రమంతా నిరసనలు
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఆందోళన కొనసాగుతోంది. ఛార్జీలను పెంచుతూ రాష్ట్రప్రజానికంపై ‘బాదుడే బాదుడు’ భారం మోపుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తు్న్నారు. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ విజయవాడలోని గొల్లపూడి నుంచి మైలవరం వరకు బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఛార్జీల భారంపై ప్రభుత్వ వైఖరిని వివరించారు.
రూ.20 పంచిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని
ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపైన కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరు తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం ఏలూరు జాతీయ రహదారిపై వినూత్న నిరసనకు దిగారు. దెందులూరులో బస్సు డిపోను సందర్శించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచుతున్న ఛార్జీలు, పన్నుల గురించి ప్రజలకు చింతమేని ప్రభాకర్ వివరించారు. పెరిగిన ఛార్జీల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు, రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు టీడీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.20 నోటుతో పాటు ఓ చల్లటి మజ్జిగ ప్యాకెట్ అందజేశారు. పెంచిన చార్జీలను ప్రయాణికులు భరించలేకున్నారని చెప్పేందుకే రూ.20 ఇస్తున్నట్లు చింతమనేని తెలిపారు. అలాగే, ఎండ ధాటి నుంచి ఉపశమనానికి మజ్జిగ ప్యాకెట్ అందజేసినట్లు చింతమనేని చెప్పారు.