Kollu Ravindra: టీడీపీకి భయపడే జగన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ ల మార్పులు : కొల్లు రవీంద్ర
YSRCP Incharges Change: 11 చోట్ల వైసీపీ ఇన్‌ఛార్జీలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చడంపై సొంత పార్టీలోనూ ఆందోళన నెలకొంది.
TDP Politics: తిరుపతి: మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనుండగా, అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఇన్‌ఛార్జ్ లను మారుస్తోంది. 11 చోట్ల వైసీపీ ఇన్‌ఛార్జీలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చడంపై సొంత పార్టీలోనూ ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఈ విషయాన్ని క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. ప్రజలకు మెరుగైన సేవల కోసమే వైసీపీ ఇంఛార్జీల మార్పు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని మార్పులు అన్న జగన్ మాట.. ప్రజల కోసం కాదని టీడీపీ అంటోంది. ప్రజలపై సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ఇన్‌ఛార్జీలను మార్చుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని, వారితో లాభం లేదనుకుని మరిన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను జగన్ మార్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.
టీడీపీ నేత కొల్లు రవీంద్ర బుధవారం శ్రీవారి దర్శనార్ధం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల భేరి ప్రారంభం అయ్యిందని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈనెల 20వ తారీఖుతో ముగియనుందని తెలిపారు. విశాఖపట్నం వేదికగా టీడీపీ ఎన్నికల శంఖారావం మోగించనుందన్నారు.
వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు దిశ దశలను, ప్రణాళికలను టీడీపీ సిద్దం చేస్తోందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సీఎం జగన్ మళ్ళీ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలను మరోసారి మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు ఓటమి భయం, మరోవైపు తమ పార్టీకి భయపడి నియోజకవర్గం ఇంఛార్జ్ లను వైసీపీ అధినేత జగన్ మార్చడం నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపి మంత్రులు,ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, ప్రజలు వారిని నమ్మే పరిస్ధితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు.