కందుకూరు, గుంటూరు ఘటనలు ప్రభుత్వం కుట్రే- తప్పు చేసిన పోలీసులపై కేసులు: చంద్రబాబు
తెలుగుదేశాన్ని, ఆ పార్టీ నేతలు వేధించాలని ప్రయత్నిస్తున్న కొందరి పోలీసు అధికారులు, పోలీస్ వ్యవస్థపై కేసులు పెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. కచ్చితంగా వారందర్నీ కోర్టు బోనులోకి లాగుతామన్నారు.
పోలీసులు, ప్రభుత్వం చేసిన కుట్రల్లో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తనను తన మీటింగ్‌లకు వచ్చే జనాలను కట్టడి చేయడానికే ఇలాంటి చర్యలకు తెగబడ్డారని విమర్శించారు. ఇలాంటివి చాలా చూశామని... ఎప్పుడూ భయపడి వెనక్కి వెళ్లలేదని... ఇప్పుడు కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు చంద్రబాబు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వైఎస్‌ఆర్‌సీపీ మీటింగ్‌లకు ఇబ్బంది పెట్టలేదన్నారు చంద్రబాబు. తామే అడ్డుకొని ఉంటే జగన్, షర్మిల, విజయలక్ష్మి పాదయాత్ర చేసేవారా అనిప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా తన ప్రచార వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని ఆరోపించారు. అందుకే నిరసనగా పాదయాత్రతో సభా వేదిక వద్దకు వెళ్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
తమను వేధించాలని ప్రయత్నిస్తున్న కొందరి పోలీసు అధికారులు, పోలీస్ వ్యవస్థపై కేసులు పెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. కచ్చితంగా వారందర్నీ కోర్టు బోనులోకి లాగుతామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ లీడర్లు కూడా ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. అన్ని రంగాల్లో విఫలమైన జగన్... తన మానసిక ఆనందం కోసం ప్రజలను బెదిరించాలని ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. అందుకు ఉదాహరణే కుప్పంలో జరిగిన ఘటనలు అన్నారు.
గతంలో ఎప్పుడూ కుప్పంలో ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ఒక్క చోటే కాదని రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో అశాంతి ఉందని... మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రపంచమంతా చూస్తోందన్నారు. కుప్పంలో గతంలో లేని వివాదాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. కచ్చితంగా భవిష్యత్‌లో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో పోలీసులను, నాయకులను పెట్టి బెదిరిస్తే గెలిచినట్టు కాదని... వచ్చే ఎన్నికల్లో ప్రజలు సత్తా చూపుతారన్నారు. మొన్న దొంగచాటున వచ్చిపోయినట్టు కాదని... దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్ చేశారు. ప్రజలు వెంబడించి కొడతారని వార్నింగ్ ఇచ్చారు.
కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరించారు. 11:30 నుంచి కుప్పం టీడీపీ కార్యాలయంలో గుడుపల్లి మండల 5 ,6 క్లస్టర్ లతో సమావేశమయ్యారు. 12 నుంచి రామకుప్పం మండల 3,4 క్లస్టర్‌లతో సమావేశమయ్యారు. మధ్యాహ్నన భోజన విరామం తర్వాత 2.30 నుంచి శాంతిపురం మండల 1 ,2 క్లస్టర్లతో మీటింగ్ నిర్వహించనున్నారు. 4 నుంచి కుప్పం మండల 7, 8, 9 క్లస్టర్లతో సమావేశం కానున్నారు. 6 నుంచి కుప్పం మున్సిపాలిటీ 10, 11 క్లస్టర్లతో సమావేశం అయ్యి పార్టి కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.
మొదటి రోజు అవాంతరాలు, అడ్డగింత నడుమ చంద్రబాబు నాయుడు పర్యటన ఉత్కంఠగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-1 నిబంధనల మేరకు సభలు, రోడ్డు షోకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో టిడిపి అధినేత చంద్రబాబు పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసుల తీరుపై టిడిపి కేడర్ ఆగ్రహించింది. చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు శాంతిపురం మండలంలోఇంటింటి ప్రచారం నిర్వహించారు. బుధవారం రాత్రి పదకొండు గంటల వరకూ చంద్రబాబు పర్యటించి ప్రజల సమస్య అడిగి తెలుసుకుని, నేను ఉన్నాంటూ భరోసా కల్పించారు. తరువాత కుప్పంలోనే బస చేసిన చంద్రబాబు రెండోవ రోజు కార్యక్రమాలు చేపట్టారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై రెండు కేసులు పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని డిఎస్పి సుధాకర్ రెడ్డి చెప్పడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న ఘటనలపై చంద్రబాబుతోపాటుగా పలువురు టిడిపి నాయకులు మీద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.