(Source: ECI/ABP News/ABP Majha)
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ హౌస్ అరెస్టు, తప్పించుకొని రోడ్డెక్కి నిరసన - తీవ్ర ఉద్రిక్తత!
పెద్దపప్పూరు మండలంలోని పెన్నానదిలో ఇసుక తరలింపుల పరిశీలనకు వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటిని నిర్బంధం చేశారు.
పెన్నా నదిలో ఇసుక తరలింపుల వ్యవహారం మళ్లీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించగా, ఆయన బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పెద్దపప్పూరు మండలంలోని పెన్నానదిలో ఇసుక తరలింపుల పరిశీలనకు వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటిని నిర్బంధం చేశారు. బారీకేడ్లు ఉంచి ఆయన నివాసం వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అడ్డు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలను, ఇంకొంత మంది నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హౌస్ అరెస్టు నుంచి తప్పించుకున్న జేసీ, రోడ్డుపై నిరసన
ఎట్టకేలకు జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై నుంచి తప్పించుకొని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై కూర్చున్నారు. ఈ క్రమంలోనే జేసీకి, ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ జేసీ కింద పడిపోయారు.