SSLV-D1 Latest Update: ఇక ఆ శాటిలైట్స్ పనికిరావు, SSLV రాకెట్‌లో జరిగిన లోపం ఏంటంటే: ISRO
ISRO త్వరలో SSLV-D2 తో తిరిగి రానున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇస్రో ఛైర్మన్ ఫుల్ స్టేట్మెంట్ త్వరలో ఇస్తారని ట్వీట్ చేసింది.
నేడు (ఆగస్టు 7) ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ తాజా అప్‌డేట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ప్రకటించింది. నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాల్సిన ఈఓఎస్-02, ఆజాదీ శాట్ ఉపగ్రహాలు ఇక పనికిరావని ఇస్రో ప్రకటించింది. ఆ రెండు ఉపగ్రహాలను ముందుగా నిర్ణయించిన కక్ష్య అయిన 356 కిలో మీటర్ల ఎత్తులో సర్క్యులర్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 km x 76 km ఎలిప్టికల్ ఆర్బిట్ (దీర్ఘవృత్తాకార కక్ష్య) లో ప్రవేశం అయ్యాయని ఇస్రో వివరించింది. దీనివల్ల ఆ శాటిలైట్ల వల్ల ఉపయోగం ఉండబోదని ట్వీట్ చేసింది. ఇందుకు కారణాన్ని కూడా గుర్తించామని ట్వీట్ లో పేర్కొన్నారు. రాకెట్ లో సెన్సార్ వైఫల్యాన్ని గుర్తించి, salvage action కు వెళ్లడంలో లాజిక్ ఫెయిల్యూర్ అయిందని ఇస్రో వెల్లడించింది.
దీనికి సంబంధించి ఒక కమిటీ విశ్లేషించి సిఫారసు చేస్తుందని పేర్కొంది. ఈ రికమండేషన్స్ ను అమలు పర్చి, ఇస్రో త్వరలో SSLV-D2 తో తిరిగి రానుందని ప్రకటించింది. ఈ అంశంపై ఇస్రో ఛైర్మన్ ఫుల్ స్టేట్మెంట్ త్వరలో ఇస్తారని ట్వీట్ చేసింది.
(1/2) SSLV-D1/EOS-02 Mission update: SSLV-D1 placed the satellites into 356 km x 76 km elliptical orbit instead of 356 km circular orbit. Satellites are no longer usable. Issue is reasonably identified. Failure of a logic to identify a sensor failure and go for a salvage action
— ISRO (@isro) August 7, 2022
(2/2) caused the deviation. A committee would analyse and recommend. With the implementation of the recommendations, ISRO will come back soon with SSLV-D2.
— ISRO (@isro) August 7, 2022
A detailed statement by Chairman, ISRO will be uploaded soon.
ఉదయం నుంచి సస్పెన్స్
ఇస్రో చేపట్టిన SSLV - D1 రాకెట్ ప్రయోగం విషయంలో ఉదయం నుంచి సస్పెన్స్ నెలకొంది. శ్రీహరి కోట లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం జరిగింది. ఆదివారం (ఆగస్టు 7) తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయి.. 9.18 నిమిషాలకు రాకెట్ ఆకాశంలోకి దూసుకొని వెళ్లింది. అయితే, అన్ని స్టేజ్‌లు తాము ఊహించినట్లుగానే జరిగాయని, కానీ, టెర్మినల్ స్టేజ్‌లో డేటా లాస్ జరిగిందని ఇస్రో ట్వీట్ చేసింది. దాని గురించి తాము విశ్లేషణ చేస్తున్నామని పేర్కొన్నారు. రాకెట్ స్థితిపై త్వరలోనే అప్ డేట్ ఇస్తామని ఇస్రో ట్వీట్ చేసింది. మళ్లీ మధ్యాహ్నానికి అప్ డేట్ తో కూడిన ట్వీట్ చేసింది.
ఈ SSLV - D1 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-02 తో పాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ తయారు చేయించిన ఆజాదీ శాట్ ను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని 75 స్కూళ్లకు చెందిన స్టూడెంట్స్ యారు చేశారు. ఇది షార్ నుంచి చేసిన 83వ రాకెట్ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో ఈ ప్రయోగమే మొదటిది.
శాటిలైట్స్ వివరాలు
ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలించనుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఇంకో ఉపగ్రహం ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని తయారు చేశారు. భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. ఈ ఆజాదీ శాట్ పని చేసే లైఫ్ 6 నెలలు మాత్రమే. ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిన జాతీయ గీతం రికార్డ్ వెర్షన్‌ను ఫీడ్ చేశారు.
SSLV రాకెట్ ఎందుకు?
ఇస్రో ఇప్పటిదాకా శాటిలైట్స్ ను నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడానికి పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్లను వాడేది. దీన్ని తయారుచేయడానికి 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకు అయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లు మాత్రమే. పీఎస్ఎల్వీ రాకెట్ తయారీ కోసం వెచ్చించే శ్రమ, ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే ఇస్రో చిన్నగా లేదా తక్కువ బరువు ఉండే ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చడానికి ఎస్ఎస్ఎల్వీ వైపు మొగ్గు చూపింది. ఈ ఎస్ఎస్ఎల్వీ రాకెట్ పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న కమర్షియల్ శాటిలైట్స్ ను కక్ష్యలోకి తీసుకెళ్లగలదు.