Somu Veerraju: తిరుమలలో అన్యమత ప్రార్థనలు, మళ్లీ జరగొద్దు - సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
తిరుమలలో అన్యమత ప్రస్తావన, అన్యమత ప్రార్థనలు చేయరాదని అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.
తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఉపద్రవం నుంచి శ్రీవారు రక్షించారని, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనేక మంది మేధావులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, రాష్ట్రంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే మొదటి స్థానంలోకి ఏపీకి వచ్చేలా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
తిరుమలలో అన్యమత ప్రస్తావన, అన్యమత ప్రార్థనలు తిరుమలలో చేయరాదని, కొందరు మంత్రులు తిరుమలలో అన్యమత ప్రస్తావన తెచ్చారని, అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్.. అభివృద్దికి అనువైన రాష్ట్రమంటూ సోము తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు.
అయితే, సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆయన ఎవర్ని టార్గెట్ చేస్తూ అన్నారు? నిజంగా తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగాయా? అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని గతంలో కూడా బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై టీటీడీ అధికారులు కూడా స్పందించారు. వారు చేసిన ఆరోపణలను గతంలోనే ఖండించారు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, అలా జరిగితే ఉపేక్షించబోమని టీటీడీ అప్పుడే ప్రకటించింది.
మోదీ దత్తపుత్రికగా ఏపీ అభివృద్ధి - సోము
రాష్ట్రంలో రెండు పార్టీలు కుటుంబ పాలన సాగించాయని సోము వీర్రాజు నిన్న (సెప్టెంబరు 6) విమర్శించారు. మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దత్త పుత్రికగా ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రూ.8.16 లక్షల కోట్లతో ఏపీలో మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఏపీలో మోదీ జన్మదిన వేడుకలు జరుపనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.
జూ.ఎన్టీఆర్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జూ.ఎన్టీఆర్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు ఆదివారం (సెప్టెంబరు 4) మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామని అన్నారు. టీడీపీపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని అన్నారు. జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువ అని, ఆయన సేవలు ఉపయోగించుకుంటామని అన్నారు. ఫ్యామిలీ పార్టీలకు దూరమని బీజేపీ అధిష్ఠానం చెప్పిందని వ్యాఖ్యలు చేశారు.
కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న అవినీతి, ప్రధాని మోదీ అందిస్తున్న పథకాలు, సేవలను ప్రజలకు తెలియజేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 5 వేల బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి సంకల్పించామన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకూ 5 వేల సభలను నిర్వహిస్తామన్నారు. రావులపాలెం కొత్తపేట అమలాపురాన్ని అనుసంధానిస్తూ మరొక నేషనల్ హైవేను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని సోము వీర్రాజు తెలిపారు. కాకినాడ జిల్లాకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చామన్నారు. కేంద్రం నుంచి వెయ్యి కోట్ల సహాయాన్ని అందిస్తామన్నారు. తీర ప్రాంత మండలాల్లో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటుచేస్తామని అన్నారు.