Tirumala Snake Catcher: స్నేక్ క్యాచర్ ఈస్ బ్యాక్, ఇప్పటిదాకా 10 వేల పాములు - చావుబతుకుల నుంచి మళ్లీ విధుల్లోకి
Tirumala: గత జనవరి 28న పాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితి నుండి కొలుకున్న భాస్కర్ నాయుడు మూడు నెలల తరువాత విధులకు హజరయ్యారు.
స్నేక్ బాస్ ఈస్ బ్యాక్ అన్నట్లుగా స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఈస్ బ్యాక్. దాదాపు 10 వేలకు పైగా పాములను పట్టి భాస్కర్ నాయుడు స్నేక్ క్యాచర్ పేరొందాడు. గత జనవరి 28న పాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితి నుండి కొలుకున్న భాస్కర్ నాయుడు మూడు నెలల తరువాత విధులకు హజరయ్యారు. మళ్లీ శేషాచలం అటవీ ప్రాంతంలోని పాములకు దడ పుట్టిస్తున్నాడు.
కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల పుణ్యక్షేత్రం దట్టమైన శేషాచల అడవుల్లో ఉంటుంది. ప్రతి ఏడాది భక్తులు రాక పెరుగుతుండగా క్రమేపి తిరుమల అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందినా తిరుమలలో అటవీ వాతావరణం ఇప్పటికి అలానే ఉంది. ఈ కారణంగా నిత్యం కొండపై జనావాసాలలోకి సర్పాలు సంచరిస్తుంటాయి.. ఎవరైనా పామును చూస్తే వామ్మో అనకతప్పదు.. కానీ స్నేచ్ క్యాచర్ భాస్కర్ నాయుడికి మాత్రం పాము పట్టడం చేయి తిరిగిని పని.. ఫోన్ చేస్తే చాలు నిమిషాలలో వాలిపోతాడు.. క్షణంలో పాములు పట్టేస్తాడు.. పట్టిన వాటిని సురక్షితంగా దూరంగా అడవుల్లో వదిలేస్తాడు.. ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏళ్లుగా తిరుమల కొండపై భక్తులకు, స్థానికులకు, టీటీడీ ఉద్యోగులకు ఎలాంటి హానీ కలగకుండా ఒక రక్షకుడిలా భాస్కర్ నాయుడు ఉన్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..
అర అడుగు పాము పిల్ల దగ్గర్నుండి 20 అడుగుల పొడవైన పామునైన సరే ఇట్టే అలవోకగా పట్టేస్తాడు. తిరుమలలోని ప్రతి కాటేజీ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఎప్పుడు ఏ పాము మీదకు వస్తుందో అని భక్తులు భయపడుతూ ఉంటారు. అలా భయ పడుతున్న భక్తుల పట్ల ఆ ఏడుకొండల వాడు కరుణిస్తాడో లేదో కానీ పాములను బంధించే స్నేక్ క్యాచ్చర్ భాస్కర్ నాయుడు మాత్రం ప్రత్యక్షం అవుతుంటాడు.. భక్తుల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుపెట్టి కాల నాగులను సైతం చాక చక్యంగా బంధిస్తాడు. అలా బంధించిన పాములతో కాసేపు భక్తులకు చూపిస్తూ విన్యాసం చేయిస్తాడు.. అలానే ఆ విష సర్పాలతో ఆటలు సైతం ఆడుకుంటాడు.. తాను పట్టుకున్న పాములు తనకు ఎలాంటి హాని తలపెట్టకుండా తనతో పాటు తెచ్చుకున్న కాటన్ బ్యాగులో బంధించి తిరుమలకు దూరంగా భక్తులు సంచరించని అటవీ ప్రాంతంలో వదిలి పెడుతాడు స్నేక్ మ్యాన్ భాస్కర్ నాయుడు..
1982లో టీటీడీ అటవీశాఖలో ఉద్యోగిగా విధుల్లోకి భాస్కర్ నాయుడు చేరాడు..10 ఏళ్ళు తరువాత ఆయన్ను అంటే 1992లో శాశ్వత ఉద్యోగిగా తీసుకుంది టీటీడీ.. ఆ సమయంలో భక్తులను భయపెడుతున్న పాములను బంధించడంతో టీటీడీ అధికారుల దృష్టి ఈయనపై పడింది. దీంతో అధికారుల ఆదేశాల మేరకు అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులను విష సర్పాల నుండి కాపాడేందుకు స్నేక్ మ్యాన్ గా అవతారం ఎత్తాడు.. సుమారు 30 సంవత్సరాల్లో 10 వేలకు పైగా పాములను పట్టుకున్నాడు భాస్కర్ నాయుడు.. కాలకూట విష సర్పాల నుండి భక్తులను కాపాడినందుకు గాను ఎన్నో అవార్డులు, రివార్డులు సైతం భాస్కర్ నాయుడిని వరించాయి.. 2015లో ఒక స్టేట్ అవార్డు, అలాగే టీటీడీ తరపున మరో నాలుగు అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.. 2016లో ఆయన ఉద్యోగానికి పదవి విరమణ చేసినా నేటికి భక్తుల సేవే పరమావధిగా భావించి తిరుమలలో భక్తులను భయపెడుతున్న పాములను బంధిస్తున్నారు.
వేలు తొలగింపు
ఇప్పటి వరకు చాలా రకాల సర్పాలను పట్టుకున్నాను.. అందులో ప్రధానంగా నాగుపాము, జెర్రిపోతు, కొండచిలువ, గుడ్డి పింజరి, కట్లపాము, దాసరి పాము, బిల్లేరికి పాములు ఇలా చాలా పాములను పట్టుకున్నానని, మూడు సార్లు పాము కాటుకు గురైనట్లు తెలిపాడు.. ఒక వేలుకు విషం ఎక్కడంతో ఆవేలు చివరి భాగంను వైద్యులు తొలగించారు. ‘‘భక్తులు, టీటీడీ ఉద్యోగులు ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటివారు.. వారి వల్లే నేటికీ తిరుమల, తిరుపతిలో ఈ పని చేస్తున్నాను..పాము కరిస్తే ఎవరు భయపడకూడదు. ధైర్యమే దానికి విరుగుడు’’ అని భాస్కర్ చెబుతారు.
మూడు దశాబ్దాలుగా తిరుమల, తిరుపతిలో పాముల నుంచి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు దురదృష్టవశాత్తూ ఇటీవల ఓ పాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో వెళ్లాడు. దాదాపు 13 రోజులుగా మృత్యువుతో పోరాడిన భాస్కర్ నాయుడు తిరిగి కోలుకున్నాడు. అనంతరం యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. దేవుని కృపతో టీటీడీ అధికారుల సహకారంతో తిరిగి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఎల్లవేళలా అందరికి సేవ చేస్తానంటున్నాడు భాస్కర్ నాయుడు.