Nara Bhuvaneshwari Visits Kuppam: కుప్పంలో చిన్న ఇల్లు కడుతున్నాం, ప్యాలెస్ మాత్రం కట్టటం లేదు- నారా భువనేశ్వరి
NTR Memorial Trust: కుప్పంలో తాము చిన్న ఇల్లు కడుతున్నాం అని, ప్యాలెస్ మాత్రం కట్టటం లేదంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Nara Bhuvaneshwari Comments at Kuppam:
కుప్పంలో చిన్న ఇల్లు కడుతున్నాం, ప్యాలెస్ మాత్రం కట్టటం లేదు అని నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, డిసెంబర్ లోగా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఇంటిని నిర్మిస్తున్న స్థలంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకెళ్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం ప్యాలెస్ రోడ్డులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సంజీవని’ మెడికల్ క్లినిక్, సంచార ఆరోగ్య రథాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. తొలుత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. పెద్ద బంగారు నత్తంలో మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో శాంతిపురం మండలం శివ పురం వద్ద నిర్మాణంలో ఉన్న సొంతింటి పనులను పరిశీలించారు.
లోకేశ్ పాదయాత్రపై భువనేశ్వరి భావోద్వేగం..
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుప్పంలో మంగళవారం పర్యటించిన భువనేశ్వరి మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చారు. తొలుత పాదయాత్ర చేస్తుంటే తన కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. లోకేశ్ తనకు ధైర్యం చెప్పిన తర్వాత తనలో మనోధైర్యం వచ్చిందన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తుందని దీమా..
ప్రస్తుతం పాదయాత్రలో లోకేశ్ రాటు తేలిపోయారని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల కోసం లోకేశ్ పాదయాత్ర పూర్తి చేసి తీరతారన్నారు. పాదయాత్రలోనే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు ఒడ్డి పోరాడుతోందన్నారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై హర్షం..
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, స్వర్గీయ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల అవడం పట్ల భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి ఎన్టీఆర్ పేరు మీద వంద రూపాయల నాణెం విడుదల విషయంలో అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి పేరుపై నాణెం విడుదల గర్వంగా ఉందన్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు తన తండ్రి పేరుపైన కొనసాగాలని భువనేశ్వరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
Also Read: పొత్తులపై తేల్చేసిన చంద్రబాబు - తెలంగాణ, ఏపీల్లో ఎవరెవరితో అంటే ?