Peddireddy: ఈ స్కాం శాంపిలే, త్వరలో చంద్రబాబుపై మరిన్ని కేసులు - పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
సోమవారం (సెప్టెంబరు 11) తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తే ఆ పార్టీ నేతల నుంచి ఎక్కువగా నిరసనలు రాలేదని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అసలు టీడీపీ నేతలు చేసిన బంద్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ లీడర్లు కూడా చంద్రబాబు అవినీతి చేయలేదని గట్టిగా చెప్పలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల మాత్రమే అరెస్టు అక్రమం అంటున్నారని విపక్షాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో చంద్రబాబు ఇన్నాళ్లు స్టేలు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారని, అలాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం (సెప్టెంబరు 11) తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.
టీడీపీ నేతలు చేసిన బంద్ సందర్భంగా చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ తెరిచే ఉన్నాయని అన్నారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అనేది కేవలం మొదలు మాత్రమే అని, చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉంటాయని అన్నారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోవడం ఖాయమని అన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని అన్నారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడం దారుణం అని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.