Kalyana Venkateshwara Swamy: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD News: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 3 రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
Tirumala News: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. జూలై 10న పెద్దశేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.