Tirupati News: తిరుపతిలో పెద్ద అంగళ్ల వీధి గాంధీ స్ట్రీట్‌గా ఎలా మారింది- దీని వెనుకు ఉన్న చరిత్ర ఏంటీ?
Gandhi Street In Tirupati: తిరుపతి లోని వ్యాపార సముదాయం గాంధీ రోడ్. ఆ వీధిని పూర్వం పెద్ద అంగళ్ళ వీధిగా పిలిచేవారు. అయితే ఒక్క ఇన్సిడెంట్‌తో ఆ వీధి స్థితే మారిపోయింది.
Independence Day Celebration: తిరుపతి ఒకనాడు కుగ్రామంగా ఉండేది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆ నాటి చిన్న తిరుపతిలోని రోడ్లు మీద నడిచి తిరుమలకు వెళ్లే వారు. ఇలాంటి తిరుపతిలో నేడు మహానగరంగా మారింది. అలాంటి నగరంలో వాణిజ్య కేంద్రంగా ఉన్న గాంధీరోడ్డు చరిత్ర వింటే ఆశ్చర్యపోతారు.!
తిరుపతి నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న ప్రస్తుత గాంధీరోడ్డు ఒకనాటి కాలంలో పెద్ద అంగళ్ల వీధిగా పిలిచేవారు. ఆ నాడు ఉన్న పేరు గాంధీ రోడ్డుగా ఎలా మారిందో నేటి కాలంలో చాలా మంది కి తెలియదు.
తిరుమల శ్రీవారి ఆలయానికి చాల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు పరిపాలన అనంతరం టీటీడీ బోర్డు ఏర్పాటైంది. అయితే 1921 కాలం వరకు తిరమల ఆలయంలోకి హరిజన, గిరిజనులకు ప్రవేశం ఉండేది కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం చేసే సమయం 1921 సెప్టెంబర్ 28న పూణే నుంచి మద్రాసు వెళ్లే క్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి తిరుపతి వచ్చారు.
బస చేసిన చోట విగ్రహం
తిరపతికి వచ్చిన గాంధీజీకి బస ఏర్పాటు చేయడం అప్పటి స్థానికులకు చాల ఇబ్బందిగా మారింది. అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ల బస కోసం ఓ భవనం మాత్రమే ఉండేది. అది 1900 ఫిబ్రవరి 7న నిర్మించారు. అదే టౌన్ క్లబ్ సమీపంలోని నేటి జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్న భవనం. గాంధీజీ వస్తున్న విషయం తెలుసుకున్న అప్పటి తిరుమల పరిపాలకులు మహంత్.. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుమల పరిధిలో ఉన్న నేటి ఎస్పీ కార్యాలయంలో గాంధీజీకి బస కల్పించారు. నాడు గాంధీజీ ఆ భవనం నుంచి అంటరానితనం నిర్మూలనకు, హరిజన, గిరిజనుల ఆలయ ప్రవేశం కోసం అక్కడి నుంచి ప్రసంగించారు.
సాధారణంగా మనకు గాంధీజీ చేతిలో కర్ర, మరో చేతిలో భగవద్గీత ఉండే విగ్రహాలను చూస్తుంటాము.. ఒక వేళ గాంధీజీ కూర్చుని ఉన్న పక్కనే భగవద్గీత, కర్ర ఉంటుంది. కాని ప్రస్తుతం ఉన్న ఎస్పీ కార్యాలయం, ఎస్పీ ఛాంబర్‌లో మనకు ఆ రెండు కనిపించవు. ఎందుకంటే.... ఆ ప్రాంతం నుంచి గాంధీజీ దళితుల కోసం చేసిన ప్రసంగంలో చేతిలో కర్ర, భగవద్గీత లేకుండా ఉన్నాయని, దానికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏ భంగిమలో నిల్చోని ప్రసంగించారో అదే తీరునా విగ్రహాన్ని 1950లో అప్పటి టీటీడీ తొలి ఈవో అన్నారావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కాలినడకన తిరుపతి వీధుల్లో
పూర్వం తిరుపతి నాలుగు ప్రధాన వీధులతో తిరుమలకు వెళ్లే యాత్రికులకు ప్రవేశ ద్వారం... ముగింపు ద్వారం ఉండేది. నేటికి అవి మనకు దర్శనమిస్తాయి. నాడు గాంధీజీ బస చేసిన ప్రాంతం నుంచి పెద్ద అంగళ్ల వీధి... చిన్న బజారు వీధి... అనంతవీధి మీదుగా పాదయాత్ర చేసారని మనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో పాదయాత్రగా తిరుమలకు వెళ్లి హరిజన, గిరిజనులతో కలిసి ఆలయ ప్రవేశం చేశారని కూడా చెబుతారు. ఆయన నడిచిన మార్గం కావడంతో ఆ రోడ్డును గాంధీ రోడ్డుగా మార్చారు. అనంతరం రేణిగుంటకు చేరుకుని మద్రాసులో స్వాతంత్ర్య పోరాటానికి వెళ్లారని అంటారు. నాటి తిరుపతి పాదయాత్ర గుర్తుగా అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మద్రాసు సెంట్రల్ లైబ్రరీలో అప్పటి ఫొటో కూడా ఉంది.