Vinayaka Chavithi 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే- కర్ణాటక, తమిళనాడును ఆదర్శంగా తీసుకోలేమా?
Andhra Pradesh News: వినాయక చవితి వేడుకలకు సిద్దం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ లో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఎక్కువ అమ్మకాలు సాగుతునాయి. వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Tirupati News: వినాయక చవితి అనగానే వాడవాడలో సందడి నెలకొని ఉంటుంది. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం చేసే వరకు చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆడుతూ పాడుతూ కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహిస్తారు. అలాంటి వినాయక చవితి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి.
వినాయక చవితి అంటే పర్యావరణహితంగా నిర్వహించాలని నాయకులు సభల్లో ప్రసంగిస్తారు.. అధికారులు సమావేశాల్లో ఆదేశాలు జారీ చేస్తారు... ప్రకృతి ప్రేమికులు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఇదంతా కేవలం పండుగ వారం.. పది రోజుల నుంచి మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రసాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల్లో అత్యధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక మట్టి బొమ్మలు... నీటిలో సులభంగా కరిగిపోయే విగ్రహాలు మాత్రం తయారీ తక్కువ.. విక్రయాలు తక్కువగా ఉన్నాయని తయారీ, వ్యాపారస్తులు అంటున్నారు.
తయారీదారులు లేక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి వీధిలో వినాయక విగ్రహాలు కొలవుతీర్చి పూజలు చేస్తారు. ప్రతి చోట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పండుగకు మూడు నెలల ముందు నుంచే విగ్రహాలు తయారీ వాటికి రంగులు వేయడం చేస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎక్కువ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వారే తయారీ చేసి విక్రయాలు చేస్తున్నారు. ఇక మట్టి, నీటిలో కరిగిపోయే విగ్రహాలు గురించి చాలా వరకు తయారీ చేసే ప్రాంతాలు తెలియకపోవడం దానికి తోడు తయారీ చేసే వారు కరువై పోవడంతో మట్టి బొమ్మలు లేవని చెప్పొచ్చు.
పూజకు ప్రతిఫలం లేకుండా చేయకండి
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యము ఎక్కువగా నెలకొంటుంది. విగ్రహాల తయారీలో వినియోగించే రసాయనాలు వల్ల విగ్రహాలను నీటిలో వేయడం వల్ల రంగులు రసాయానాల కారణంగా నీటిలోని జలరాసులకు ప్రమాదం ఉంది. నీటిలో కరిగే కొంచెం పాటి రసాయనాల వల్ల ఆ నీటిని తాగే జనజీవరాశులు ప్రమాద భారీన పడతాయి. వాటి వల్ల అనారోగ్య సమస్య వస్తాయి. ఇక నీటిని పంటలకు ఉపయోగిస్తే ఆ పంటలు వృద్ధి చెందకపోవడం, ఆ నీటి ద్వారా వచ్చే ఆహారం తినడం వల్ల అనారోగ్య లక్షణాలు గురికాక తప్పదు.
ముఖ్యంగా ఎంతో పవిత్రంగా భావించే వినాయక స్వామి వారిని పూజలు చేసి నీటిలో కలుపుతాము. మట్టిలో కరిగిపోయే విగ్రహాలు వల్ల దేవుడు కూడా శాంతిస్తాడని... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీటిలో కరగకుండా రోజుల తరబడి విగ్రహాలు ఉండడం వల్ల చేసిన పూజా కూడా ఫలించిందని అర్చకులు చెబుతున్నారు.
రెండు రాష్ట్రాలు నిషేధం విధించలేవా..?
కర్నాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాయి. పర్యావరణంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విగ్రహానలను వాడకూడదని ప్రచారం చేయడంతోపాటు వాటి తయారీదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోని చాల ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిషేధించారు. తిరుపతి సమీపంలోని బొమ్మల క్వార్టర్స్ లో తయారు చేసే సుమారు 3 లక్షల విగ్రహాలు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా విక్రయాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అయిన పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేధించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ ఏడాది సమయం ముగిసిపోయింది.. వచ్చే ఏడాది ముందే ఇతర రాష్ట్రాల లాగా మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీదారులకు ముందస్తుగా చెప్పి. మట్టి, నీటిలో కరిగిపోయే విగ్రహాలను తయారు చేయాలని నిమజ్జన కమిటీ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు విన్నవిస్తున్నారు.