(Source: ECI/ABP News/ABP Majha)
Tirumala News: తిరుమలలో మళ్ళీ వన్య మృగాల భయం- ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి
Tirumala News: ఈ నెలలో చిరుత, ఎలుగుబంటి ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో అధికారులు అప్రమత్తయ్యారు. వన్యమృగాల సంచారం ప్రాంతంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు.
Tirumala News: తిరుమలలో మరోసారి వన్యమృగాల సంచారం భక్తులను కలవర పెడుతోంది. ట్రాఫ్‌కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కనిపించడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తిరుమలలో మరోసారి వన్యమృగాల సంచారం కలకలం రేపుతుంది. అలిపిరి కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో రెండు వన్య మృగాలు దర్శనమిచ్చాయి. వన్య మృగాల కదలికలు గుర్తించేందుకు ఏర్పాటు చేసినా ట్రాప్ కెమెరాలకు చిరుత, ఎలుకబంటి చిక్కాయి. ఈ రెండింటి కదలికలు నమోదైనట్టు టీటీడీ అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
అధికారులు అప్రమత్తం
ఈ నెలలో చిరుత, ఎలుగుబంటి ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో అధికారులు అప్రమత్తయ్యారు. వన్యమృగాల సంచారం ప్రాంతంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. చిరుత సంచారం ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. చిరుత పాదముద్రలు సేకరిస్తున్నారు. ఇటీవలే నడక మార్గం, ఘాట్ రోడ్డులో చిరుత సంచారం తగ్గుముఖం పట్టిందని టిటిడి అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ చిరుత, ఎలుకబంటి సంచారంతో ఉలిక్కిపడ్డారు. అటు శ్రీవారి భక్తులకు చిరుత భయం పట్టుకుంది.
ఒకే నెలలో రెండు సార్లు ట్రాప్‌కు చిక్కిన చిరుత..!!!
అలిపిరి కాలిబాట, శ్రీవారి మెట్టు మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారం టిటిడిని కలవర పెడుతుంది. టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలిబాట మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే, బాలికపై దాడి చేసి చంపేసిన దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది.. దీంతో శ్రీవారి భక్తులు భయంతో వణికి పోయారు. కాలిబాట మార్గంలో తిరుమలకు వెళ్ళాలి అంటేనే భయపడి పోయారు. ఈ క్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా కాలిబాటలో ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నపిల్లల తల్లిదండ్రులను అనుమతించే విధంగా చర్యలు చేపట్టారు. భక్తులకు ఊతకర్ర ఇచ్చారు. ఏడో మైలురాయి నుంచి గాలిగోపురం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించారు. వంద మంది భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు పంపించింది టిటిడి.
చిరుత సంచారం ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చి ఇప్పటి వరకూ ఆరు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. కానీ నిరంతరాయంగా కాలిబాట మార్గంలో ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత జాడలు గమనిస్తూ ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా కాలిబాట మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత జాడ కనిపించక పోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక కాలిబాట మార్గంలో వన్యమృగాల బెడద తప్పినట్లే అని భావించే లోగా, మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది..
డిసెంబర్‌లోనే 13న, 29న చిరుత, ఎలుకబంటి కదలికలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో నమోదయ్యాయి. అప్రమత్తమైన టిటిడి భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు పంపుతున్నారు. కాలిబాట మార్గంలో చిన్నారులతో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రతగా ఉండాలని సూచిస్తుంది. దీనిపై టిటిడి అటవీ శాఖ అధికారులు స్పందిస్తూ.. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు అమర్చడంతో వన్యమృగాలు చిక్కడం మామూలేనని, కానీ కాలిబాట మార్గానికి సమీపంకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాంమని చెబుతున్నారు..