తిరుపతిలో బిడ్డ మృతదేహాన్ని టూవీలర్‌పై తరలించిన తండ్రి- అంబులెన్స్‌లు ఏమయ్యాయిని లోకేష్ ప్రశ్న
పాముకాటుతో ఇద్దరు బాలురు మృతి చెందారు. ఒక సంఘటన తిరుపతిలో జరిగితే... మరొకటి అంబేద్కర్ కోనసీమలో జరిగింది.
మరో హృదయవిదారకమైన సంఘటన. పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. కుమారుడు చనిపోయిన బాధను గుండెల్లోనే దాచుకొని తన బిడ్డ మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తరలించిన ఓ తండ్రి నిస్సహాయ స్థితి ఇది.
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరులో దారణం జరిగింది. బసవయ్య అనే ఏడేళ్ల బాలుడిని పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి తన బిడ్డను తీసుకొని కేవీబీపురం ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్టు అక్కడ ఉన్న సిబ్బంది తెలిపారు.
ఆ మాట విన్న తర్వాత ఆ బసవయ్య తండ్రి కుప్ప కూలిపోయాడు. ఆయన కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. బిడ్డ లేడన్న మాట జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టిందా తండ్రికి. కాసేపటికి తేరుకున్న ఆ తండ్రి.. చేసేది లేక బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశాడు.
అక్కడే బసవయ్య తండ్రి చంచయ్యకు మరో అవమానకరమైన సంఘటన ఎదురైంది. బిడ్డ బసవయ్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒక్కరంటే ఒక్క వాహనం కూడా ముందుకు రాలేదు. కన్నీళ్లను దిగమింగుతూ కనిపించిన వారందర్నీ వేడుకున్నాడు. అయినా ఎవరూ కనికరించలేదు. అడిగినంత డబ్బు ఇస్తానన్నా ఎవరూ ముందుకు రాలేదు.
అలా కంటి నిండా నీళ్లతో నిశ్చేష్ఠుడై నిలబడి పోయాడు. ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉండిపోయాడు. బిడ్డ మృతదేహాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లేందుకు ఎవరూ సహకరించడం లేదా అని అనుకున్నాడు. చివరకు ద్విచక్రవాహనంపై తన నివాసానికి కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. భుజన వేసుకొని.. బాధను గుండెళ్లేనే దాచుకుంటూ జరిగిన అవమానాన్ని తలచుకొని అంతిమ క్రియలు నిర్వహించారు.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి ఘాటుగా స్పందించారు. జెండా ఊపి ఊరేగించిన అంబులెన్స్‌లు ఏమయ్యాయని సీఎంను ప్రశ్నించారు. ఇలాంటి హృదయవిదారకరమైన దృశ్యాలు ప్రభుత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు.
జెండా ఊపి ఊరేగించిన అంబులెన్సులు ఏమయ్యాయి సీఎం గారూ? పాముకాటుకు చనిపోయిన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం దిగువ పుత్తూరుకి చెందిన ఏడేళ్ల తన కొడుకు బసవయ్య మృతదేహాన్ని ఆ తండ్రి బండిపై తీసుకెళ్లిన హృదయవిదారక దృశ్యం మీ అమానవీయ పాలనకి నిదర్శనం. సర్కారు అంబులెన్సులు రావు.(1/2) pic.twitter.com/Y6UtHtbelr
— Lokesh Nara (@naralokesh) October 11, 2022
పాము కాటుతో బాలుడు మృతి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఇలాంటి దుర్ఘటనే జరిగింది. పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు పాము కాటుకు గురై చనిపోయాడు. బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పైకప్పు నుంచి పడిన పాము బాలుడిని కాటేసింది. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆ బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.