Waterfalls Near Tirupati : తిరుపతికి అతి సమీపంలోనే ప్రఖ్యాత జలపాతాలు, దేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు వీటిపైనా ఓ లుక్కేయండి
Tirumala News: తిరుమల శ్రీవారి దర్శన అనంతరం తిరుపతి చుట్టుపక్కలా చూడదగ్గ ప్రదేశాలు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా అడవి ప్రాంతం మధ్యలో ఉండే జలపాతాలు చూసి తీరాల్సిందే.
Tirupati News: తిరుమల(Tirumala)కొండలు ఆధ్యాత్మికంగానే కాదు..పర్యాటకంగానూ ఇప్పుడు ఎంతో ఆదరణపొందుతున్నాయి.శేషచల ఏడుకొండల(Seshachalam Hills)పై వేంకటేశ్వరుడు మాత్రమే కాదు...లోపలకి వెళితే పదులసంఖ్యలో తీర్థాలు, వందలాది గుళ్లు ఉన్నాయి. ప్రకృతి రమణీయతకు మారుపేరైన శేషాచలం కొండల్లో వాగులు, జలపాతాలు, గుండాలకు లెక్కేలేదు. ఇక తిరుపతి సమీపంలో పెద్దఎత్తున జలపాతాలు ఉన్నాయి ఈసారి తిరుమల పర్యటన పెట్టుకుంటే మాత్రం వీటిని అస్సలు మిస్‌కావొద్దు.
ఆకాశగంగా
తిరుమల వెళ్లినవారు దాదాపు ఆకాశగంగ(Akashganga)ను సందర్శించే ఉంటారు. శేషాచలం కొండల్లోనే అతి ఎత్తైన వెంకటాద్రి కొండపై ఉంది ఆకాశగంగ జలపాతం. దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే జలపాతాన్ని కళ్లారా చూడటమే కాదు...ఆ నీటిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆకాశగంగతీర్థాన్ని భక్తులు పెద్దఎత్తున దర్శించుకుంటారు. ఆకాశగంగ తీర్థం చేరుకోవడానికి తిరుమల ఆలయం వద్ద నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎప్పుడూ ఉంటాయి.
చక్రతీర్థం జలపాతం
చక్రతీర్థం(Chakra Theertham)లో మునిగితే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికంగానూ ఈ జలపాతం ఎంతో ప్రసిద్ధి. బ్రహ్మదేవుడు ఈతీర్థంలోనే తపస్సు చేశాడని నమ్ముతారు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఈ తీర్థంలోనే తన సుదర్శన చక్రాన్ని శుభ్రం చేశాడని ప్రతీతి. అందుకే ఇక్కడ నీటికి ఎంతో శక్తి ఉంటుందని, వైద్యపరంగానూ రోగాలన్నీ నయమవుతాయని భక్తులు నమ్ముతారు. తిరుమల గుడి నుంచి శిలాతోరణం వరకు బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ చక్రతీర్థానికి చేరుకోవచ్చు. ట్రెక్కింగ్‌కు ఈ తీర్థం ఎంతో అనువుగా ఉంటుంది. సాహసయాత్ర చేయాలనుకునేవారు ఒకసారి తప్పకుండా ఈ తీర్థాన్ని దర్శించాల్సిందే.
కపిలతీర్థం
తిరుపతిలోని శేషాచల కొండ దిగువనే ఉంటుంది కపిలతీర్థం(Kapila Theerdham). వర్షాలుపడుతున్నప్పడు పైన ఉన్న గుండాల నుంచి నీరు దిగువకు పడుతుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవు. తీర్థంపక్కనే ప్రముఖ కపిలేశ్వరస్వామి ఆలయం ఉంది. అలాగే ఈ నీటికి కూడా మహత్తరమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు.ఎందుకంటే ఈ నీటిలోనే పరమశివుడు స్నానమాచరించాడని ప్రతీతి. తిరుమల వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.
కైలాసకోన జలపాతం
తిరుపతికి సమీపంలోని పాలకొండ(Paalakonda) కొండల శ్రేణిలో ఉంది కైలాసకోన(Kailasakona) జలపాతం. పచ్చని అడవి మధ్యలో తెల్లని నీటి ధారలతో కొండపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం అందాన్ని చూసి తీరాల్సిందే. పర్యాటకంగానూ ఈ జలపాతం ఎంతో ప్రసిద్ధి. అంతేకాకుండా వేంకటేశ్వరస్వామి పద్మావతిని ఇక్కడే వివాహమాడాడని ప్రతీతి. ఈ నీటికి ఔషద గుణాలతోపాటు...రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. తిరుపతి నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం.
నాగలాపురం జలపాతం
తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురం(Nagalapuram) జలపాతం చూసి తీరాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలులు, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే నాగలాపురం జలపాతం పరిసర ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తుంది. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్న వారికి ఇది కరెక్ట్ ప్లేస్. చెన్నై నుంచి ఒకరోజు ట్రెక్కింగ్ ట్రిప్ ఉంటుంది. ఇక్కడి జలపాతంలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే...నీటి అడుగుభాగాన్ని నేరుగా చూడొచ్చు. చుట్టుపక్క గంభీరమైన కొండల నడుమ జలపాతం చూడముచ్చటగా ఉంటుంది. వేపగుంట రైల్వేస్టేషన్ నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా ఈ జలపాతం ఉన్న ప్రాంతానికి చేరుకోవచ్చు.
తలకోన జలపాతం
తలకోన(Talakona)..ఆంధ్రా అమెజాన్‌గా పేరుగాంచిన ఈ అటవీప్రాంతం ముఖ్యంగా సినిమా షూటింగ్‌లకు పెట్టింది పేరు. శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్కులో ఉన్న ఈ జలపాతం చూసేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. పచ్చని ప్రకృతిని ఆశ్వాదించడానికి తలకోన ఎంతో అనువైన ప్రదేశం. అడవిలో సాహస యాత్రలు, ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి బెస్ట్ ప్లేస్. దాదాపు 270 అడుగుల ఎత్తు నుంచి జారిపడే ఈ జలపాతంలోని నీటికి ఔషద గుణాలు ఉన్నాయని నమ్ముతారు.
కైగల్ జలపాతం
పలమనేరు-కుప్పం జాతీయరహదారి మార్గంలో ఉంది కైగల్(Kaigal) జలపాతం. దీన్ని దుముకురాళ్ల జలపాతం అని కూడా పిలుస్తారు. సుందరమైన ప్రకృతి నడుమ జలజలపారే ఈ జలపాతం సైతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
తడ జలపాతం
తిరుపతికి సమీపంలో ఉన్న చూడదగ్గ జలపాతం తడ(Thada) జలపాతం. దట్టమైన అడవి మధ్య ఉండే సిద్దులయ్యకోనలో ఈ జలపాతం ఉంది. దీన్ని ఉబ్బలమడుగు జలపాతం అని కూడా పిలుస్తారు. ప్రకృతి రమణీయతకు ఈ ప్రాంతం మారుపేరుగా నిలుస్తుంది. ట్రెక్కింగ్‌కు ఈ జలపాతం ఎంతో అనువుగా ఉంటుంది.
వైకుంఠతీర్థం
ఆధ్యాత్మికంగా ఈ తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు వైకుంఠమే ఇక్కడ వెలిసిందని ప్రతీతి. రాముడి వానరసేన నుంచి వచ్చిన వానరులు ఈ ప్రాంతంలోనే ప్రత్యక్షంగా వైకుంఠాన్ని చూశారని చరిత్ర చెబుతుంది. అందుకే దీన్ని వైకుంఠతీర్థం అనిపిలుస్తారు.
ఈసారి తిరుపతి ప్రయాణం పెట్టుకున్న వారు తప్పకుండా ఈ జలపాతాల్లో ఒకటి, రెండు చూసేలా ప్రోగ్రాం పెట్టుకుంటే అటు ఆధ్యాత్మిక పర్యటనతోపాటు ఇటు ప్రకృతి అందాలను సైతం తిలకించే అవకాసం ఉంటుంది.
Also Read: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు
Also Read: రాజమండ్రి హేవలాక్ వంతెనపై టూరిజం ప్రాజెక్ట్ - రూ. 120 కోట్లతో సన్నాహాలు !