Fake Votes In AP: దొంగ ఓట్లు నిజమే- అనంతపురం జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Fake Votes In Anantapur District: దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది.
Fake Votes In Anantapur District:
ఏపీలో దొంగ ఓట్లపై టీడీపీ కొన్ని నెలల నుంచి ఆరోపణలు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం రాష్ట్రంలో దొంగ ఓట్లపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురంలో 6 వేల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు పాత ఓట్లు తొలగించిన అంశంపై సీఈసీకి పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో ఓట్ల ప్రక్రియను సీఈసీ అధికారులు పరిశీలించారు. దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించడంతో పాటు పాత ఓట్లు తొలగించారని నిర్ధారణకు వచ్చారు. దాంతో ఓట్ల అవకతవకల్లో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని సీఈసీ తేల్చింది. అందుకు బాధ్యుడైన భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
దొంగ ఓట్ల వ్యవహారంపై తెలుగు దేశం నేతలు ఎన్నికల సంఘానికి జూన్ నెలాఖరులో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారంటూ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లేఖలో తెలుగు దేశం నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఓట్ల వ్యవహరంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారంటూ తెలుగుదేశం నేతలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను సైతం ఎన్నికల కమిషనర్ కు తెలుగు దేశం నేతలు సమర్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటుగా మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఇతర నాయకులు ఈసీని కలసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికారిని సైతం ఢిల్లీకి పిలిచింది.
60లక్షలకు పైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. తెలుగు దేశం నేతలు సైతం నకిలీ ఓట్లను సీరియస్ గా తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నతాము దొంగ ఓట్లను చేర్పిస్తే, అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వాటిని నిరూపించాలి కదా అంటూ నిలదీస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన ఆరోపణలు చేశారు. పుంగనూరులో ఇంటి నెంబర్లు లేకుండా రెండు వేల ఓట్లు నమోదయ్యాయయన్నారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఓటర్ల వెరిఫికేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా బయట పడ్డాయని ఆరోపించారు. అందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల సంఘం నిజా నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.