Tirumala: టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా అందించేందుకు ఒలెక్ట్రా కంపెనీ ఒప్పందం
తిరుమలలో సామన్య భక్తుల కోసం నడుపుతున్న ధర్మ రథాల (ఉచిత బస్సుల) స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
Tirumala Tirupati Devasthanams: తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అడుగులు వేస్తోంది. తిరుమలలో సామన్య భక్తుల కోసం నడుపుతున్న ధర్మ రథాల (ఉచిత బస్సుల) స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఒలెక్ట్రా కంపెని ప్రతినిధులతో, ఆర్‌టిసి, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవనం నుండి లేపాక్షి సర్కిల్ వరకు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధికారులతో కలిసి విద్యుత్ బస్సులో ప్రయాణించారు.
ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్ల నిషేధం
టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలను కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ధడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్ల నిషేధం కూడా ఇందులో ఒక భాగమని తెలియజేశారు. తొలి విడతగా తిరుమలలో పని చేసే అధికారులకు విద్యుత్‌తో నడిచే కార్లను అందజేశం అన్నారు. రెండవ విడతగా తిరుపతి, తిరుమల మధ్య విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టామన్నారు. వీటికి భక్తుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.
రెండవ విడతలో తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు 10 బస్సులు విరాళంగా ఇవ్వాలని ఒలెక్ట్రా కంపెని అధినేత కృష్ణారెడ్డిని కోరానని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బస్సులను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బస్సుల డిజైనింగ్, నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. భక్తులకు సదుపాయంగా ఉండేలా బస్సులను డిజైన్ చేయాలని సూచించినట్లు చెప్పారు.
మూడవ దశలో తిరుమలలో తిరిగే ట్యాక్సీలు, ఇతర అద్దె వాహనాల స్థానంలో టీటీడీ సహకారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఒలెక్ట్రా కంపెని ప్రతినిధులు బస్సుల డిజైన్లు, నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఎండి ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి కోరిక మేరకు 10 విద్యుత్ బస్సులు విరాళంగా అందించడం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తమకు అందించిన గొప్ప వరంగా భావిస్తున్నామని కంపెని చెప్పారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. హుండీకి భారీ ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి రోజు శ్రీవారికి ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తుంటారు అర్చకులు. గురువారం 20-10-22 రోజున 62,725 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 30,172 మంది తలనీలాలు సమర్పించగా, 5.85 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.