తిరుమలలో తరచూ రెచ్చిపోతున్న చిరుత- నడకమార్గంలో వెళ్లాలంటే భయం భయం
తిరుమల కాలిమార్గంలో మూడు నెలల్లో రెండోసారి చిరుత దాడి చేయడం ఆందోళన కలిస్తోంది. నడక మార్గంలో వెళ్లే భక్తులు భయం భయంగా తిరుమల కొండకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.
తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి కాలి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. దేవుడి దర్శనం సంగతి తర్వాత ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు. తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల సంచారం సాధారణమైపోతోంది.
ఇప్పటి వరకు నడక మార్గంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి కానీ ఎవరిపై దాడి చేసిన ఘటన చాలా అరుదుగా ఉండేవి. ఎవరి దారిలో వారు వెళ్లిపోయే వారు కానీ ఈ మధ్య కాలంలో చిరుత దాడులు ఎక్కువైపోయాయి. ఈ ఏడాదిలోనే ఇది రెండో దాడి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
తిరుమల శ్రీనివాసుడు అంటేనే కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం. అలాంటి దేవుని వద్దకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు సెంటిమెంట్ పాటిస్తుంటారు. కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకున్న వారిలో భయాందోళన మొదలయ్యాయి. వరుసగా చిరుత దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండటంతో కంగారు పెట్టిస్తోంది.
దాడి జరిగినప్పుడల్లా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ప్రకటనలు ఇస్తోంది. మొన్న జూన్‌లో జరిగినప్పుడు కూడా అదే చెప్పారు. బాలుడు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ దాడితో అలర్ట్ అయిన టీటీడీ కొన్ని భద్రతా చర్యలు తీసుకుంది.
నడక మార్గంలో వచ్చే వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటించింది. ఎవరినీ ఒంటరిగా వెళ్లనీయకుండా గుంపులుగుంపులుగా పంపించింది. రాత్రి పూట ప్రయాణాలను పూర్తిగా నిషేధించింది. దాడి చేసిన చిరుతలను కూడా బంధించింది. దట్టమైనఅటవీ ప్రాంతంలో విడిచి పెట్టింది.
కొన్ని రోజులు ఈ చర్యలు కఠినంగా అమలు చేసిన టీటీడీ తర్వాత లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీనిపై భక్తులు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో టీటీడీ విఫలమైందని అంటున్నారు.
పాపను చిరుత లాక్కెళ్లి చంపేయడంతో మరోసారి కాలిమార్గంలో భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ పాత రూల్స్‌ను కఠినం చేస్తోంది. ఎవరినీ ఈ మార్గంలో ఒంటరిగా పంపించడం లేదు. గుంపులు గుంపులుగా విడిచిపెడుతోంది.
ఏడాదిలో రెండో ఘటన
తిరుమల నడక మార్గంలో ఈ ఏడాదిలోనే రెండు విషాధాలు చోటు చేసుకోవడం కాస్త కలవర పెట్టే అంశమే అంటున్న భక్తులు. జూన్‌లో జరిగిన చిరుత దాడిలో బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడికి మెరగైన వైద్యం అందించింది టీటీడీ. పూర్తిగా కోలుకుతున్న తర్వాత తల్లిదండ్రులకు అప్పగించింది.
ఇప్పుడు మాత్రం ప్రాణాలు పోయాాయి
లక్షిత విషయంలో మాత్రం ఘోరం జరిగిపోయింది. దాడి జరిగింది రాత్రి పూట కావడంతో భక్తులు, అధికారులు త్వరగా స్పందించలేకపోయారు. రాత్రంతా గాలించినా చిన్నారిని కాపాడుకోలేకపోయారు. ఉదయం వరకు అసలు పాపను చిరుత ఎటు తీసుకెళ్లిందో కూడా తెలుసుకోలేకపోయారు. ఉదయం కొండకు వస్తున్న భక్తులు గుర్తించి చెప్పే వరకు ఆచూకి కనుగోలేకపోయారు. ఇదే తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
Also Read: తిరుమలలో దారుణం- చిన్నారిని చంపేసిన చిరుత