Chittoor Crime News: తిరుపతిలోని భాకరపేట రోడ్డులో వెళ్లాలంటే భయం- నిత్యం ప్రమాదాల ప్రయాణం
Bhakarapeta Crime News: తిరుపతి మదనపల్లి ని కలిపే భాకరాపేట రోడ్‌లో ప్రమాదాలకు నెలవుగా మారింది. ప్రతి రోజు 3 ప్రమాదాలు ఐయిన జరుగుతునాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
Bhakarapeta Crime News: ఆ రోడ్డులో వెళ్లాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ప్రయాణించాలి. పగలు.. రాత్రి అనే తేడా లేదు ఏ సమయంలో అయినా ప్రమాదం జరిగే ప్రాంతం అది. ఏదైన ప్రమాదం జరిగితే ఎవరికైన సమాచారం ఇవ్వాలన్న నెట్ వర్క్ రాదు. అలాంటి ప్రాంతంలో ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతుంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మదనపల్లి- తిరుపతి మార్గాన్ని అనుసంధానం చేస్తూ భాకరపేట అటవీ ప్రాంతం ఉంది. శేషాచలం అడవుల్లో మార్గం వైపు సుమారు 12 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 10 కిలో మీటర్లు మొత్తం రోడ్డు ఘాట్ రోడ్డు. ప్రమాదకర మలుపులు, చిన్నపాటి బ్రిడ్జి లు కూడా ఉన్నాయి.
ప్రతి రోజు ప్రమాదాలు
భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రతి రోజూ సుమారు మూడు.. అంతకంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం మూడు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోనే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
మదనపల్లి నుంచి భాకరాపేట వరకు ఆరు వరసల రహదారి నిర్మాణం జరుగుతోంది. గడిచిన రెండేళ్లలో ఈ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే భాకరాపేట వరకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి తిరుపతి వరకు రహదారి పనులు ప్రారంభంకాలేదు. ఫారెస్ట్ శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉండగా పనులు చేయలేదని సమాచారం.
శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి సంతోషంగా తిరుగు ప్రయాణం అయిన కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్‌కు చెందిన నలుగురిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. నలుగురు స్వామి వారి దర్శనం చేసుకుని సంతోషంగా బయలుదేరిన భాకరాపేట ఘాట్ రోడ్డులోకి ప్రవేశించారు. కలకడ నుంచి టమోటో లోడుతో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న కర్నాటక రాష్ట్ర వారిపై పడింది.
కారులోని రమేష్ మూర్తి (34), హెచ్ కె మంజునాథ్ (38), హెచ్ జి ముని వెంకట రెడ్డి (55) లారీ కింద పడి ఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులోని తేజేస్ కుమార్ (35) తీవ్ర గాయాలతో కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదానికి గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేసీబీ సాయంతో లారీని పక్కకు తీసి తీవ్ర గాయాలైన తేజేస్ కుమార్‌ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ అల్లావుద్దీన్ తీవ్ర గాయాలు కాగా అతడిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్విగ్గి బాయ్ అనుకున్నారు.. కాని
స్మగర్లు రోజుకొక అవతారం ఎత్తుతున్నారు. తాజాగా గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ఓ వ్యక్తి స్విగ్గీ బాయ్ అవతారం ఎత్తి గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నాడు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన సత్తుపతి శ్రీనివాసరావు తిరుపతి మారుతీనగర్లో ఉంటూ స్వీగ్గి బాయ్ గా పని చేస్తున్నాడు. చెడు అలవాట్లను బానిసై అక్రమ సంపాదనకు తన స్విగ్గి బాయ్ అవతారాన్ని గంజాయి తరలింపు, విక్రయాలకు పూనుకున్నాడు. ఏజెన్సీ నుంచి తిరుపతికి వచ్చే గంజాయిని ఏజెంట్ల ద్వారా రూ.10 వేలుకు కొనుగోలు చేస్తాడు. దానిని చిన్న ప్యాకెట్లుగా మార్చి రూ.300 చొప్పిన తిరుపతి, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇలా గంజాయి సేవించే వారికి ఫోన్ చేస్తే గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నాడు. గతంలో కూడా ఇతనిపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసు నమోదు అయినట్లు తెలిపారు. కాగా తిరుపతి కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి వద్ద నిఘా పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
బోయకొండ అడవిలో పేకాట రాయుళ్లు అరెస్టు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ అడవిలో కొందరు పేకాట శిబిరాలు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పేకాట శిబిరాల పై దాడి చేసి 13 మందిని చౌడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.13,80,000 నగదు, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.