Madakasira Assembly constituency: మడకశిరలో ట్రయాంగిల్ ఫైట్- ఎన్డీఏ, వైసీపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ
Satya Sai District: కాంగ్రెస్ అభ్యర్థి ఎంట్రీతో మడకశిరలో ఆసక్తి పోరు నెలకొంది. రెండు పార్టీల మధ్యే ఫైట్ అంటుందని అనుకుంటే అది కాస్త ట్రయాంగిల్ ఫైట్‌లా మారింది.
Andhra Pradesh News: సత్యసాయి జిల్లాలో ఏకైక ఎస్సీ నియోజకవర్గం మడకశిర. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధానంగా ఇరు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడంతో లెక్కలు మారిపోయాయి. ఎన్డీఏ, వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు గట్టి పోటీ కాంగ్రెస్ అభ్యర్థి ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో నిలుస్తున్నారు..
త్రిముఖ ఉన్న మడకశిరలో వైయస్సార్సీపి అభ్యర్థిగా ఉపాధి కూలీ చేసుకునే ఈరలకప్పను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టిడిపి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ పోటీకి దిగుతున్నారు. దీంతో మూడు పార్టీలకు చెందిన నేతలు ఒకే సామాజికవర్గం కావడంతో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వైసిపి అభ్యర్థిగా ఈర లక్కప్ప:
వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉపాధి హామీ కూలి పని చేసుకునే సామాన్యుడు ఈర లక్కప్పను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈర లకప్ప ఒక స్వచ్ఛంద సంస్థలో ప్రైవేటు టీచర్‌గా పని చేసుకుంటూ గత కొంతకాలంగా వైఎస్ఆర్సిపిలో యాక్టివ్‌గా పని చేశారు. అనుకోని కారణాలతో వైసిపి నేత ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిని కాదని ఈయన్ని వరించింది టికెట్. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందరూ ఈర లక్కప్ప అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తూ గెలిపించుకుంటాం అంటూ జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పినట్లు సమాచారం.
కూటమి అభ్యర్థి సునీల్ కుమార్...
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి ప్రకటించింది. దీన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు మొదట్లో వ్యతిరేకించారు. అనంతరం జరిగిన పరిణామాలతో వారు చెల్లబడ్డారు. కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యతను నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలదే అని దిశా నిర్దేశం అధినేత చంద్రబాబు చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్:
దశాబ్ద కాలం పాటు రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ ఈసారి బరిలో నిలిచారు. షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ బరిలో నిలుస్తూ ఎన్డీఏ, వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కే సుధాకర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి ప్రియ శిష్యుడు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుధాకర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ రఘువీరారెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కలిసి వచ్చే అంశం.
గెలుపు అవకాశాలు ఎవరి వైపు :
ఎవరికి వారు నియోజకవర్గంలో గెలుపు మాదే అన్న ధీమాతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ నుంచి సామాన్యుడు ఈర లక్కప్ప పోటీ చేస్తుంటే మన వైపు ఎన్డీఏ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే సుధాకర్ కూడా ఈసారి మడకశిరలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.