![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
నగరి వైసీపీ నేతల మధ్య బయటపడ్డ విభేదాలు - జగన్ ప్రయత్నించినా కలవని చేతులు
నగరిలో బహిరంగ సభ ప్రారంభానికి ముందు కేజే శాంతి, మంత్రి రోజా మధ్య సఖ్యత పెంచేందుకు జగన్ ట్రై చేశారు. వారితో ఏదో మాట్లాడుతూ ఇద్దరి చేతులు కలిపేందుకు కూడా ప్రయత్నించారు
![నగరి వైసీపీ నేతల మధ్య బయటపడ్డ విభేదాలు - జగన్ ప్రయత్నించినా కలవని చేతులు CM Jagan Tried to mend the differences between nagari YSRCP leaders నగరి వైసీపీ నేతల మధ్య బయటపడ్డ విభేదాలు - జగన్ ప్రయత్నించినా కలవని చేతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/28/e482b8d0b8efe97dde3c6624e1b5d2271693208286090215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సీఎం జగన్ మోహన్ రెడ్డి నగరి పర్యటనలో భాగంగా వైసీపీలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. నగరిలో ఎప్పటి నుంచో మంత్రి రోజాకు ఇతర నేతలకు అసలు పడటం లేదు. నగరిలో పర్యటించిన సీఎం జగన్ వారి మధ్య విభేదాలు సరి చేసేందుకు ట్రై చేశారు.
నగరిలో బహిరంగ సభ ప్రారంభానికి ముందు కేజే శాంతి, మంత్రి రోజా మధ్య సఖ్యత పెంచేందుకు జగన్ ట్రై చేశారు. వారితో ఏదో మాట్లాడుతూ ఇద్దరి చేతులు కలిపేందుకు కూడా ప్రయత్నించారు. మొదట కేజే శాంతి తన చేయి ఇచ్చేందుకు నిరాకరించారు. అయినా సీఎం జగన్ ఆమె చేయిని పట్టుకొని రోజాతో చేయి కలపాలని చూశారు. కానీ ఏదో అలా చేతులు కలిపి వెంటనే వెనక్కి తీసుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. గత కొన్ని నెలలుగా మంత్రి పెద్దిరెడ్డి, రోజా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా కూడా ఈ కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. సీఎం పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా రోజా ఫొటో లేదు.
నగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఇన్చార్జ్ లు సీఎంకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో ఎక్కడ కూడా మంత్రి రోజా ఫొటోలు కనిపించలేదు. వడమాలపేట వైసిపి ఇన్చార్జ్ మురళి, పుత్తూరు వైసిపి ఇన్చార్జ్ అమ్ములు, నగరి వైసిపి ఇన్చార్జ్ కె.జె.కుమార్, కె.జె.శాంతి, నిండ్ర మండల వైసిపి ఇన్చార్జి చక్రపాణి రెడ్డిలు కలిసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలలో సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్నాయే తప్ప స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హోదాలో వ్యవహరిస్తున్న రోజా ఫోటోలు ఎక్కడ లేవు..
సీఎం పర్యటనకు జన సమీకరణ కూడా రోజాకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తుంది. మంత్రి రోజా ఆధ్వర్యంలో సభ జరుగుతున్నందున ఐదు మండలాల ఇంఛార్జ్‌లు జన సమీకరణకు దూరంగా ఉన్నారు. దీంతో జన సమీకరణం చేయడంలో రోజా ఇబ్బందులు పడ్డారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా సభకు హాజరు కావాలంటూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి మహిళలను సభకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. అయితే చాలా మంది ప్రజలు సభకు వచ్చేది లేదని చెప్పడంతో బస్సులన్ని కూడా ఖాళీగా కనిపించాయంటున్నారు. నగరి, పుత్తూరు డిపోలకు చెందిన బస్సులే కాకుండా కడప జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని బలవంతంగా తరలించారని చెప్పుకుంటున్నారు.
జగన్ పర్యటన సందర్భంగా 50కిపైగా ప్రైవేటు పాఠశాలలకు చెందిన వ్యాన్లను మంత్రి రోజా అనుచరులు తీసుకెళ్లారట. నగరిలో రెండు కిలోమీటర్లపైగా షాపులను మూసివేశారు. నగరిలోని సాయిబాబా ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కడ కూడా షాపులు తెరవనివ్వలేదు. సుమారు కోటిన్నరకుపైగా ప్రజాధనం వృథా అయినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు నగరిలో పర్యటించిన జగన్ టెక్స్ టైల్ పార్క్‌తోపాటు చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్నారు. దీని వల్ల చెన్నై నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా సభలో సాక్షాత్తు ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజా చేతులను తన ప్రత్యర్థితో కలిపే ప్రయత్నం చేశారు. కానీ అందుకు రోజా జగన్‌కి చేయికు ఇవ్వకుండా నిరాకరించారు. భవిష్యత్తులో రోజా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని నగిరిలో ప్రత్యర్ధులు గుసగుసలాడుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)