Chittoor News: ఎంపీడీవో స్వామి భక్తి! డిప్యూటీ సీఎం కార్యక్రమానికి రాని వాలంటీర్లకు నోటీసులు!
MPDO notices for Volunteers in AP: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కార్యక్రమానికి హాజరు కాలేదని వాలంటీర్లకు ఎంపీడీఓ నోటీసులు జారీ చేయడం దుమారం రేపుతోంది.
MPDO serves notices for Grama Sachivalayam volunteers
చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఎంపీడివో స్వామి భక్తి ప్రదర్శించారు. చిత్తూరు జిల్లాలో యాభై మంది వాలంటీర్లకు ఎంపీడీవో నోటీసులు ఇవ్వడం దుమారం రేపుతోంది. శుక్రవారం ఎస్.ఆర్.పురం మండలంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో "జగనన్న మళ్ళీ ఎందుకు రావాలి" అనే కార్యక్రమంను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల నారాయణ స్వామి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నారాయణ స్వామికి బదులుగా ఆయన కుమార్తె కృపాలక్ష్మీ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి స్ధానిక ఎంఆర్ఓ, ఎంపీడిఓ కూడా గైర్హాజరు అయ్యారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం మండలంలోని వాలంటీర్లను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో మండలంలోని అన్ని గ్రామ సచివాలయ వాలంటీర్లకు ముందే సమాచారం అందించారు. కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలంటూ హుకూం జారీ చేసినట్లు తెలుస్తోంది. కానీ మండలం పరిధిలోని కొందరు వాలంటీర్లు ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. దీంతో డెప్యూటీ సీఎం కుమార్తె కృపాలక్ష్మీ పార్టీ కార్యక్రమానికే వాలంటీర్లు రాకపోతే ఎలా అంటూ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయం కాస్తా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెవిన పడడంతో విషయం సీరియస్ అయింది. వాలంటీర్ల గైర్హాజరుపై నారాయణ స్వామి ఎంపిడిఓకు చివాట్లు పెట్టారని తెలుస్తోంది. దీంతో ఎంపిడిఓ నారాయణ స్వామిపై భక్తిని ప్రదర్శించేందుకు "జగనన్న మళ్ళీ ఎందుకు రావాలి" అనే కార్యక్రమానికి గైర్హాజరు ఐనా వాలంటీర్లకు ఎస్.ఆర్.పురం ఎంపీడిఓ నోటీసులు జారీ చేశారు. కార్యక్రమానికి గైర్హాజరు అయిన యాభై మంది వాలంటీర్లు మూడు రోజుల్లో తగిన సంజాయిషీ తెలియజేయలని, లేని పక్షంలో వారిని శాశ్వతంగా విధులను నుండి తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యక్రమానికి రానందుకు వాలంటీర్లకు నోటీసులు జారీ చేయడం, వివరణ ఇవ్వకపోతే విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించడం ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రాని కార్యక్రమానికి, ఆమె కుమార్తె హాజరు కావడంతో మండలం ఎమ్మార్వో, ఎంపీడిఓనే హాజరు కాలేదని, అలాంటి సమయంలో తమకు నోటీసులు ఇవ్వడం ఏంటని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.