Chandrababu Donation: మనవడి బర్త్‌డే నాడు చంద్రబాబు 33 లక్షల విరాళం, ఒకరోజు అన్నప్రాద వితరణ కోసం
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్‌లో భక్తులు ఉచితంగా భోజనం చేయవచ్చు.
Chandrababu Family Donates 33 Lakhs to TTD: టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ (Tirumala Tirupati Devasthanam) అన్నప్రసాద ట్రస్ట్ కు రూ.33 లక్షల విరాళం అందించారు. దీంతో ఒక రోజంతా తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దేవాన్ష్ పేరు మీద అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు.. ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టినరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్నదాన ట్రస్టుకు డొనేషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక దేవాన్ష్ నామకరణం, అన్నప్రాశన కూడా తిరుమల లోనే జరగడం విశేషం..
ఇక టీటీడీ దాతల కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్ట్ లో (Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Center) ప్రత్యేక స్కీములు అమలు చేస్తోంది.. ఒక రోజు మొత్తం దాత పేరు మీద అన్న ప్రసాద వితరణ జరగాలంటే 33 లక్షలు ట్రస్టుకు డొనేషన్ చేయాల్సి ఉంటుంది... అదే మధ్యాహ్నం కానీ లేదా రాత్రి కానీ ఒక పూట అన్న ప్రసాద వితరణ చేయాలంటే 12.65 లక్షల రూపాయలు విరాళం చేయాల్సి ఉంటుంది.. ఉదయం పూట అల్పాహారం మాత్రమే డొనేట్ చేసే దాతలు 7.70 లక్షలు టీటీడీకి చెల్లిస్తే వారి పేరు మీద అన్న ప్రసాద వితరణ జరిగినట్టుగా బోర్డులో దాత పేరు ప్రదర్శిస్తుంది టీటీడీ.
ప్రపంచంలోనే అతిపెద్ద అన్నప్రసాద సెంటర్‌గా పేరు!
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి (Tirumala Tirupati Devasthanam) ఆలయానికి సమీపంలోనే ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్‌లో భక్తులు ఉచితంగా భోజనం చేయవచ్చు. తిరుమలకు వచ్చిన భక్తులకు ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్నం, రాత్రికి భోజనాలను నిర్దేశిత సమయాల్లో అందిస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత భోజన సదుపాయం ఉన్న వ్యవస్థగా దీనికి పేరుంది. ఇక్కడికి వచ్చే వేలాది సంఖ్యలో భక్తులు వేచి ఉండకుండానే భోజనం చేసేలా ఇక్కడ ఏర్పాటు ఉంటుంది. రెండు అంతస్తుల్లో నాలుగు అతి భారీ డైనింగ్ హాల్స్ ఈ సెంటర్‌లో ఉంటాయి. ఒక్కో డైనింగ్ హాల్‌లో ఏకంగా వెయ్యి మంది కూర్చొని ఒకేసారి భోజనం చేయవచ్చు.
ఇటీవలే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్‌ను (Matrusri Tarigonda Vengamamba Anna Prasada Center) అత్యాధునిక భవనంలోకి మార్చారు. పూర్తిగా అత్యాధునిక పరికరాలు, వ్యవస్థతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఆధునిక వంట పరికరాలతో పాటు, భక్తులకు వడ్డన కోసం ట్రాలీలు, భారీ గిన్నెలు, డైనింగ్ టేబుళ్లు ఉంటాయి. ఈ అన్నప్రసాద సెంటర్‌ను నిర్వహించేందుకు కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సూపర్ వైజర్లు, వంటవారు, హౌస్ కీపింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు మొత్తం కలిపి వెయ్యి మంది వరకూ సిబ్బంది ఉంటారు.
ప్రతి రోజూ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకూ ఏడాదిలోని 365 రోజులూ భోజనం వడ్డిస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తుడికి ఉచితంగా, తిన్నంత భోజనం వడ్డిస్తారు.