AP Minister RK Roja: పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల స్థాయి అది కాదు, ఎన్నికల్లో గెలవలేదు కానీ !: మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
AP Minister RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్, మంత్రి అయి ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌లకు సీఎం జగన్‌ను విమర్శించే స్ధాయి కాదన్నారు.
తిరుపతి : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్, మంత్రి అయి ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌లకు సీఎం జగన్‌ను విమర్శించే స్ధాయి కాదన్నారు. ఇవాళ (జూన్ 11న) ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో నగిరి నియోజకవర్గం ప్రజలతో కలిసి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు. గడప గడపకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే ప్రజలు హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారని మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, సంక్షేమ పథకాలకు కోత పెట్టకుండా ప్రజలకు ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న వారికి కచ్చితంగా పధకాలు అందుతున్నాయని, ప్రజాధరణ చూసి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు, లోకేష్‌లు ఏడుస్తున్నారని, 10 వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు తక్కువగా ఉత్తీర్ణత సాధించడంపై కూడా రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. పిల్లలతో రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని, టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులతో జూమ్ మీటింగ్ పెట్టారని, ఇదే ఆన్‌లైన్ మీటింగ్‌లో మాజీ మంత్రి కోడాలి నాని కనిపించడంతో నారా లోకేష్ కంగుతిని పారిపోయారని ఆరోపించారు. అబద్దాలు చెప్పడం కాదు, మా ప్రభుత్వానిది తప్పే అయితే జూమ్ మీటింగ్‌కు హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు నిలదీయ లేదని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు వాలకం చూస్తుంటే అడ్డంగా పెరిగాడని, అవసరమైందే పెరగలేదంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు మంత్రి రోజా. మాట్లాడితే ఎలక్షన్‌కు రండి, టీడీపీ గెలువకుంటే పార్టీని భూస్థాపితం చేస్తామని అంటున్నారు.
తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్ పై అచ్చెన్నాయుడు ఎంత కోపంగా ఉన్నారో ఈ మాటలు చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కుప్పంలో ఘోర పరాజయం తరువాత టీడీపీని మూసేయాలన్న ఆలోచనలో అచ్చెన్నాయుడు ఉన్నాడని, తిరుపతి ఎన్నికల సందర్భంగా పార్టీ లేదు తొక్క లేదు అని ఆయన అప్పుడే చెప్పాడని మంత్రి రోజా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేసే ముందు ఒక స్పష్టత ఉండాలని, జనసేన కార్యకర్తల కోసమా లేక, ప్రజల కోసమా అనే క్లారిటీ ఉంటే బెటర్ అని చూసించారు.
చంద్రబాబుకి కష్టం వస్తే, పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని, దమ్ము దైర్యం ఉంటే టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో పోల్చి చూస్తే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అర్ధం అవుతుందన్నారు. రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కళ్యాణ్, మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా నెగ్గలేని లోకేష్‌లది సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి కాదని, మా ఎమ్మెల్యేల స్థాయి కూడా మీకు లేదని, చర్చకు మీరు సిద్ధం అంటే మీ మేనిఫెస్టో తీసుకురండి అంటూ సవాల్ విసిరారు. స్వీర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసారని, కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదని ఆమె ఎద్దెవా చేశారు. ఇప్పటికే తెలంగాణలో భూస్థాపితం అయినా టీడీపీ, ఇక ఏపీలోనూ మూతపడటం ఖాయంమని మంత్రి రోజా జోస్యం చెప్పారు.