(Source: Poll of Polls)
Somu veerraju: కేసీఆర్ కుమార్తె ఐనా, సిసోడియా ఐనా శిక్ష తప్పదు: సోము వీర్రాజు
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అయినా, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఐనా, ఇంకా ఎవరైనా చట్టం ముందు అందరూ ఒక్కటేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
తిరుమల : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అయినా, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఐనా, ఇంకా ఎవరైనా చట్టం ముందు అందరూ ఒక్కటేనని, అవినీతితో అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో, చట్టంతోనూ శిక్ష తప్పదన్నారు సోము వీర్రాజు. ఆదివారం ఉదయం తిరుమల స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సోము వీర్రాజు శ్రీవారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో దిశ దశ ఉన్న ప్రభుత్వం రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత గానీ, విడిపోక ముందు గానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకత్వాన్ని రాష్ట్రానికి ఏం కావాలో తెలియకుండా అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నిధులతో ఏపీ అభివృద్ధి చెందుతుందని, ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల మయంగా చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.
2024 లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి వచ్చే జనసేన పార్టీతో ఎన్నికలకు వెళ్తామని సోము వీర్రాజు ప్రకటించారు. ఎవరు స్కాంలు చేసినా, ఆ స్కామ్ చేసింది కేసీఆర్ కూతురైనా, సిసోడియా అయినా చట్టం ముందు ఒక్కటేనన్నారు. అవినీతితో అధికారంలో ఉండాలని ప్రయత్నం చేసేవాళ్లు వాళ్ళు ప్రజా క్షేత్రంలో ఓడిపోతారని, చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. దొంగ ఓట్లపై మేము ఫిర్యాదు చేశామని, డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకునే ప్రయత్నం జరుగుతుందని, డబ్బు ఇచ్చి ఓట్లు వేసుకుంటున్నా నైతికంగా ఓడిపోతున్నాం అనే భయం ఉందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు డబ్బు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆయన విమర్శించారు. దొంగ ఓట్లు, నగదు లాంటి నేరాలతో విజయం సాధించాలని అధికార పార్టి చూస్తుందని, రేపు దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తే బీజేపీ అడ్డుకునేందుకు సిద్దంగా ఉందన్నారు. తిరుమల క్షేత్రాన్ని ఆదాయ వనరులుగా అధికారులు, ప్రభుత్వం చూస్తుందని, దేవదాయ శాఖను, దేవ ఆదాయ శాఖగా ప్రభుత్వం మర్చిందన్నారు. భక్తుల వసతి గదుల ధరలను ఆదాయం కోసం పెంచిందని, తిరుమలలో భక్తులు ఎవరికీ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, పవిత్రత కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. పెంచిన గదుల ధరలను తగ్గించాలని, ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాక పోతే ఛలో తిరుపతి యాత్రను మళ్ళీ చేపడుతామని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. నిన్నటి వరకూ దొంగ ఓట్ల కలకలం రేగగా, నేడు విశాఖ డబ్బులు పంపిణీ చేస్తూ ఓ వ్కక్తి పట్టుబడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను మభ్య పెట్టడానికి వైసీపీ డబ్బుల పంపిణీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. విశాఖ కృష్ణా కాలేజీ సమీపంలో వైసీపీ కార్యకర్తగా చెబుతున్న వ్యక్తి డబ్బులు పంపిణీ చేస్తుండగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ఓ వ్యక్తి వద్ద 87,000 నగదును అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసకున్న రెవెన్యూ అధికారులు ఆరాతీస్తున్నారు.