YS Jagan: అన్నమయ్య జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, రూ.10 లక్షల చొప్పున పరిహారం
Ex-Gratia For Annamayya Road Accident Victims: అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు పరిహారం ప్రకటించారు.
YS Jagan Ex-Gratia For Annamayya Road Accident:
అమరావతి: అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సుకు జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున సహాయం చేయాలని నిర్ణయించారు. కాగా, ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఆరుగురు మృతి
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించేందుకు తరలించినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..
ఆర్టీసీ బస్సు కడప నుంచి తిరుపతికి వెళ్తోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుల్లంపేట సమీపంలో జాతీయ రహదారిపై సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఎదరుగా వచ్చి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరీశీలించారు. డెడ్ బాడీలతో పాటు గాయపడిన వారిని చికిత్స అందించేందుకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial