Annamayya District: 23 మంది వలంటీర్లు, ఉద్యోగుల సస్పెండ్, మళ్లీ 3 రోజుల్లోనే తిరిగి డ్యూటీకి - అసలు ఏమైందో తెలుసా?
కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీడివో అనూహ్యరీతిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. మళ్లీ 3 రోజుల్లోనే ఆ ఉత్తర్వులను రద్దు చేశారు.
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్ధతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయచ్చని భావించారు. ప్రతి గ్రామంలో వాలంటీర్ల ద్వారా అర్హులకు ప్రతి నెల పింఛన్ అందించడమే కాకుండా, సంక్షేమ పథకాలు పేదలకు దగ్గర చేసేందుకు వాలంటీర్ వ్యవస్ధ ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తుంది. అయితే గ్రామ స్ధాయిలో ప్రభుత్వ పధకాలు అమలు చేయాల్సిన వాలంటీర్లు భిన్నంగా వ్యవహరిస్తూ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిని తెచ్చి పెట్టాయి. ప్రభుత్వం విధించిన హద్దులను మీరి వాలంటీర్లు వ్యవహరిస్తూ, అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులకు చిక్కి ఊసలు లెక్క బెట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
తాజాగా మొలకలచెరువు మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో విధులు నిర్వర్తించే వాలంటీర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీడివో రమేష్ బాబు అనూహ్యరీతిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేయగా, ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఎంపీడివో జీవో విడుదల చేయడంపై అనేక సందేహాలు తలెత్తున్నాయి.
వివరాల్లోకి వెళ్ళితే.. అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు మండల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న వాలంటీర్ల పని మొదట్లో బాగానే ఉండేది.. రానూ రానూ వాలంటీర్లు పని తీరుపై రోజు మండల ఏంపీడివోకి ఫిర్యాదులు వచ్చేవి.. అయితే ఇలాంటి ఫిర్యాదు అంతా సహజమే అని భావించిన ఎంపీడీవో రమేష్ బాబు నిమ్మకుండి పోయారు. రోజు రోజుకి వాలంటీర్లు పని తీరుపై విమర్శలు రావడంతో, గ్రామ ప్రజల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో మండల ఎంపీడీవో రమేష్ బాబు వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శుల పని తీరుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఫిర్యాదులు అందుతున్న గ్రామాల్లో నేరుగా ఎంపీడీవోనే ప్రజలను కలిసేవారు. గ్రామ స్థాయిలో తలెత్తున్న సమస్యలకు నేరుగా ఆయనే పరిష్కారం చూపేవారు.
13న ఉత్తర్వులు జారీ
అంతటితో ఆగకుండా బయోమెట్రిక్ హాజరు, విధులు నిర్లక్ష్యం వహించినందుకు మొలకలచెరువు మండలం పరిధిలోని 23 మంది వాలంటీర్లను విధులు నుండి తొలగిస్తూ, ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ ఈ నెల 13వ తారీఖున ఆర్.ఓ.సి.నెం.బి/33/2022తో ఎంపీడీవో రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మళ్లీ వెనక్కి
ఇంతలో ఏమైందో ఏమోగానీ ఈ నెల 14వ తారీఖున వాలంటీర్లను తొలగించనట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దంటూ ఎంపిడివో రమేష్ బాబు స్వయంగా సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 15వ తారీఖున సస్పెండ్ చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకు తీసుకొవాలని ఆయా 15 గ్రామాల సర్పంచ్ లు కోరినట్లు, వారికి మరో అవకాశం కల్పిస్తూ తిరిగి విధుల్లోకి తీసుకొంటున్నట్లు ఆర్.ఓ.సి.నెం.బి/33/2022తో ఎంపిడివో రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకే ఆర్.ఓ.సి నెంబర్ తో రెండు ఉత్తర్వుల్లో, మొదటి జీవోలో ఆంగ్లంలో సంతకం చేయగా, రెండో జీవోలో తెలుగులో సంతకం చేశారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి తట్టుకోలేక పోయాడో ఏమోగానీ ఈనెల 16వ తారీఖున జారీ చేయాల్సిన ఉత్తర్వులు, ఒక్క రోజు ముందుగానే అంటే ఈ నెల15వ తేదీ ఆదివారం రోజునే ఉత్తర్వులు జారీ చేసారు. విధుల నుండి తొలగించిన అధికారే తిరిగి వీధుల్లో తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.