Chittoor Politics: ఉమ్మడి చిత్తూరులో మారిన రాజకీయం- పాలిటిక్స్‌కు దూరమైన గల్లా ఫ్యామిలీ! వారి వారసులు దూరం
Chittoor Politics: ఉమ్మడి చిత్తూరు రాజకీయాలు మారిపోయాయి. కొందరు నేతలు కన్నుమూయగా వారి వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. కొందరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Chittoor Political News: ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే పలువురు రాజకీయ నేతలు గుర్తుకు వస్తారు. ఇక్కడ నుంచే ఎంతో మంది ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా సేవలు అందించారు. ఇక్కడ నుంచి రాష్ట్రమే కాదు కేంద్ర స్థాయిలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి జిల్లాలో అప్పుడు సీనియర్ నాయకులు నేడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొందరు వారసులు రాజకీయాలపై ఆసక్తి చూపినా, వారికి ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
చదలవాడ కృష్ణమూర్తి
చదలవాడ కృష్ణమూర్తి 1973లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు. 1981లో నాయుడుపేట సర్పంచ్‌గా గెలిచారు. ఈ క్రమంలో 1994లో తిరుపతి నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించారు, కానీ పలు కారణాలతో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చదలవాడ కృష్ణమూర్తి 1999లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తిరుపతి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు.
అనంతరం కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉండి 2014లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కినా, చివరి నిమిషంలో అది చేజారింది. 2014లో పార్టీ అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2018లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి తిరుపతి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలలో చక్రం తిప్పిన నేతలు కొందరు కొందరు కన్నుమూయగా, మరికొందరు నేడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
గల్లా కుటుంబం
గల్లా కుటుంబ అంటే రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు లేరు. ఎన్నో పరిశ్రమలు పెట్టు ఉపాధి కల్పన చేసిన కుటుంబం. చంద్రబాబు సొంత గడ్డ అయిన చంద్రగిరి నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలుగా మారిన వారు. గల్లా అరుణకుమారి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు గానూ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ గా వ్యవహరించారు. ఆ తరువాత చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989 లో మొదటిసారి, 1999-2014 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తరువాత మూడు సార్లు మంత్రి పదవిలో కొనసాగారు. 2008వ సంవత్సరంలో వైద్య విద్య, ఆరోగ్య బీమా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈమె ఆరోగ్యశ్రీ పథక విజయానికి ముఖ్య భూమిక పోషించారు.
2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాల్గవసారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 నవంబరులో రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో భూగర్భ, గనుల శాఖా మంత్రిగా సేవలు అందించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అదే సమయంలో రాజకీయ అరంగేట్రం చేసిన తన తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు నియోజక వర్గానికి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక అయ్యారు. ఓటమి తరువాత రాజకీయాలలో ఉన్న 2019 ఎన్నికల తరువాత ఇబ్బందులు పడ్డారు. వ్యాపార పరంగా ఇబ్బందులు రావడంతో కుటుంబం మొత్తం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పాతూరి రాజగోపాల్ నాయుడు
ఈ పేరు పెద్దగా ఎవరికి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు కాని గల్లా అరుణకుమారి తండ్రి అంటే ఇట్టే గుర్తు పడుతారు. రాజన్న స్వతంత్ర పార్టీ తరపున చిత్తూరు నియోజక వర్గము నుంచి వరుసగా రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 6వ లోక్ సభకు 1977-1980 మధ్య కాలంలోనూ, 7 వ లోక్ సభకు 1980-1984 మధ్య కాలంలో వీరు పార్లమెంటు సభ్యునిగా వ్యవహరించారు.
అగరాల ఈశ్వర్ రెడ్డి
ఈయన పాత కాలం వారికి స్పీకర్ గా.. కొత్త తరం వారికి కాలేజీ వ్యవస్థపకుడిగా తెలుసు. 1967, 1978లో తిరుపతి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 27 మార్చి 1981 నుండి 6 సెప్టెంబర్ 1982 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 7 సెప్టెంబర్ 1982 నుండి 16 జనవరి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా కూడా సేవలు అందించారు. 202లో 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
శివ ప్రసాద్
చంద్రబాబు నాయుడు, శివప్రసాద్ బాల్య స్నేహితులు. ఆయన ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1999లో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమిచెందారు. 2019 సెప్టెంబరు 21న కన్నుమూశారు. రాజకీయాలతో పాటు సినిమా పై ఆయనకు ఉన్న ఆసక్తి తో పలు సినిమాల్లో నటించారు. వీరి కుటుంబం నుంచి మరెవ్వరు రాజకీయాల్లోకి రాలేదు.
గుమ్మడి కుతూహలమ్మ
గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా, 1980 - 1985 సమయంలో చిత్తూరు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా పనిచేశారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2023లో కన్నుమూశారు.