Tirupati Mumtaz Hotel: అలిపిరి ముంతాజ్ హోటల్‍కు భూ కేటాయింపులు రద్దు - ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
Tirumala News: ఒబెరాయ్ హోటల్ గ్రూప్ నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ భూ కేటాయింపుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 20 ఎకరాలు భూమి కేటాయించింది.

Alipiri Mumtaz Hotel land allotments cancelled: తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, తిరుపతిలోని అలిపిరి సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూమిలో ఒబెరాయ్ గ్రూప్‌కు చెందిన "ముంతాజ్ హోటల్" నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.
ఈ హోటల్ పేరు "ముంతాజ్" అని ఉండటం, అలాగే తిరుమల కొండల సమీపంలో ధార్మిక పవిత్రత కలిగిన ప్రాంతంలో హోటల్ నిర్మాణం చేపట్టడంపై హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. "ముంతాజ్" అనే పేరు మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్‌తో సంబంధం కలిగి ఉందని, ఇది హిందూ భావనలను గాయపరుస్తుందని ఫిర్యాదులు వచ్చాయి. అలాగే, టీటీడీ భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని వాదించారు. కొత్త టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ నాయుడు ఆ భూకేటాయింపులు రద్దు చేయాలని మొదటి బోర్డు మీటింగ్ లోనే ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
Breaking News:
— Kishan | | OG🗡️🔥 (@Kishan_Janasena) November 18, 2024
తిరుమల కొండ సమీపంలో ముంతాజ్ హోటల్ కి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకోనున్న టీటీడీ.
గతంలో దేవలోకం అనే ప్రాజెక్టుకు కేటాయిస్తే దాన్ని జగన్ ముంతాజ్ అనే హోటల్ కి ఇచ్చాడు.ఆ స్థలం కొండకి ఆనుకుని ఉండటం హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ స్థలాన్ని టీటీడీ వెనక్కి… pic.twitter.com/KvV8Uhi7Yp
హిందూ సంస్థలు, స్థానిక భక్తులు ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, టీటీడీ భూములను వాణిజ్య ప్రాజెక్టుల కోసం ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని వారు వాదించారు. 2025 ఆగస్టు 7న జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో, ముంతాజ్ హోటల్ ప్రాజెక్టు కోసం అలిపిరి సమీపంలో కేటాయించిన 20 ఎకరాల భూమిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఏపీ పర్యాటక శాఖ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒబెరాయ్ గ్రూప్‌కు ప్రత్యామ్నాయంగా తిరుపతి రూరల్ ప్రాంతంలో 24.68 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. అక్కడ ఓబెరాయ్ గ్రూప్ హోటల్ నిర్మాణం చేపడుతుంది.
హిందూ ధార్మిక సంస్థలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి, ఇది తిరుమల పవిత్రతను కాపాడే చర్యగా భావించాయి. టీటీడీ భూములను ధార్మిక ప్రయోజనాల కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుందని వాటిని తాము సరి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.





















