తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పనుల్లో ప్రమాదం- ఇద్దరు కార్మికులు మృతి
గతంలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కార్మికుడు మృతి చెందాడు. అంతకు ముందు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కొర్లకుంట జంక్షన్‌లో కుప్ప కూలింది.
తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో వరుస అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద పనులు జరుగుతుండగా గడ్డర్ అమర్చే సమయంలో ప్రమాదం జరిగింది. సిమెంట్ దిమ్మె ఒక్కసారిగా పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు ఆప్కాన్స్ సంస్థకు చెందిన కార్మికులుగా గుర్తించారు. మృతులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన అభిజిత్, మరొకరు బిహార్‌కు చెందిన బార్థోమండల్‌గా పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. జెసిబిలతో విరిగిన గడ్డర్‌ను తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
గతంలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కార్మికుడు మృతి చెందాడు. అంతకు ముందు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కొర్లకుంట జంక్షన్‌లో కుప్ప కూలింది. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ స్థానికులను, భక్తులను ఆందోళనకు గురి అవుతున్నారు.
ఘటన స్ధలాన్ని చేరుకున్న తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ హరిత మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాససేతు నిర్మాణం చివరి దశలో ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. రైల్వే బ్రిడ్జ్‌పై గడ్డర్లకు సెగ్మెంట్లను అనుసంధానం చేస్తున్నప్పుడు కింద పడి పోవడం వల్ల ఇద్దరు కార్మికులు చనిపోయారన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాస సేతు నిర్మాణంలో అపశృతి చోటు చేసుకోవడం భాదాకరమన్నారు. సెగ్మెంట్ అమరుస్తున్న సమయంలో ఇద్దరు కార్మికుల మీద పడి మృతి చెందారని తెలిపారు. శ్రీనివాస సేతు తుది దశ నిర్మాణ సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాంమన్నారు.