AP Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రేపు తిరుపతి, గుంటూరు, విశాఖలో జాబ్ మేళాలు
AP Job Mela : ఏపీలో రేపటి నుంచి రెండ్రోజుల పాటు మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని జాబ్ మేళా ఏర్పాట్లను ఎంపీ విజయసాయి రెడ్డి పరిశీలించారు.
AP Job Mela : ఆంధ్రప్రదేశ్ లో శనివారం మూడు ప్రాంతాల్లో వైసీపీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుపతిలో జాబ్ మేళా ఏర్పాట్లను ఎంపీ ఇవాళ పరిశీలించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి మూడు ప్రాంతాల్లో రెండ్రోజుల పాటు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో శనివారం జాబ్ మేళాలు ప్రారంభం అవుతాయని ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని విజయసాయి రెడ్డి తెలిపారు.
మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు
టీడీపీ ప్రభుత్వంలో కేవలం వారి కులం వారికే ఉద్యోగాలు ఇచ్చారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో కులాలు, మతాలకు అతీతంగా అర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 147 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. తిరుపతి జాబ్ మేళాకు 41 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. బడుగు, బలహీన వర్గాలకు జాబ్‌మేళాలో ప్రాధాన్యం ఇస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో నిర్వహించే జాబ్ మేళాలో ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్నంలో మరిన్ని కంపెనీలు రాబోయే రోజుల్లో రానున్నాయన్నారు. నిరుద్యోగ సమస్యను తొలగించాలనే ఉద్దేశంతో జాబ్ మేళాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లపై వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, రెక్టార్ వి.శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్, మేళా వాలంటీర్లతో ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. pic.twitter.com/58KFkkUR1U
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 15, 2022
2024 తర్వాత టీడీపీ ఉండదు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సొంత పుత్రుడిని నమ్ముకొంటారా, లేకపోతే దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకుంటారా అనేది వేచి చూడాలని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ వ్యక్తి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అని విజయసాయి రెడ్డి అన్నారు. 2024 తర్వాత టీడీపీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో వారి సామాజిక వర్గానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎలా పెంచాలి అనేది ఆలోచిస్తుందన్నారు. నవరత్నాలు రూపంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి నష్టం చేకూర్చారే గానీ అభివృద్ధి చేయలేదన్నారు. వైసీపీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. శాన్ పోర్డులో లోకేశ్ చదివారా అనేది అనుమానామే అన్నారు. ఎమ్మెల్యేగా కూడా పనికి రాని వ్యక్తిని రాష్ట్రానికి సీఎం చేయాలని చంద్రబాబు చూశారన్నారు.