Laxmi Parvathi on Jr NTR : జూ.ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలోకి వస్తారు, లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
Laxmi Parvathi on Jr NTR : జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి స్పందించారు. టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్ కు అప్పగిస్తే ఆయన పార్టీలోకి వస్తారన్నారు.
Laxmi Parvathi on Jr NTR : జూ.ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతీ తెలిపారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో వైకుంఠం ద్వారం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ పార్వతీ స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ధనుర్మాసం లాంటి పవిత్రమైన వేళ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీ పార్వతీ అన్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా తృప్తిగా అనిపించిందని, టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో లక్షలాది మంది భక్తులకు స్వామి దర్శనం, ప్రసాదాలు పంపిణీ అద్భుతంగా జరుగుతుందని ఆమె కొనియాడారు.
జూ.ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు
సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత బాగుందో, టీటీడీ నిర్వహణ కూడా అదే విధంగా ఉందన్నారు లక్ష్మీ పార్వతి. రాజు మంచి వాడైతే మిగిలిన వాళ్లు కూడా బాగా పని చేస్తారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కారణమన్నారు. రాబోవు ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని దేవుడు ఎప్పుడో నిర్ణయించారని, ఎవరూ ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఎదిరించలేరన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలంతా ఆయన వెంట ఉన్నారని చెప్పిన ఆమె, జగన్మోహన్ రెడ్డికి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు అబద్ధాలు సృష్టిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం లేదని, నారా లోకేశ్ నాయకత్వాన్ని సమర్ధించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలోకి వస్తారని లక్ష్మీ పార్వతీ అన్నారు.
పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్
జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తరచూ వార్తలు వస్తుంటాయి. అటు వైసీపీ నేతలతో పాటు టీడీపీ నేతలు ఈ విషయంలో స్పందిస్తుంటారు. టీడీపీకి గతంలో ప్రచారం చేసిన జూ.ఎన్టీఆర్ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి ఏపీలో రాజకీయాలు కీలకంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని ఇటీవల తారకరత్న అన్నారు. అయితే జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వైసీపీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే జూ.ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. వచ్చే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకుంటారని, చంద్రబాబు మరో పార్టీ పెట్టుకుంటారని కూడా చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తాయన్నారు