TTD Board Meeting: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, కరోనా ముందు విధంగా దర్శనాలు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
తిరుమలలో హోటళ్లు లేకుండా అన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం అందించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి(TTD Board Meeting) సమావేశం ముగిసింది. ఇవాళ్టి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాకు వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) రూ.3096 కోట్లతో ఆమోదం తెలిపామన్నారు. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తుల అనుమతికి ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబ్బంధనలు పాటించాలన్నారు. తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. 100 మందిలో 99 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు చేశామన్నారు. 230 కోట్లతో చిన్నపిల్లల ఆసుపత్రి(Children Hospital)ని నిర్మిస్తామన్నారు.
తిరుమలలో అన్నిచోట్ల అన్నప్రసాదం
టీటీడీ ఉద్యోగులకు(TTD Empolyees) నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు రూ. 25 కోట్ల మంజూరు చేశామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించామని వెల్లడించారు. తిరుమల(Tirumala)లో అన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం అందిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుమలలో హోటళ్లు లేకుండా భక్తులకు భోజనం అందించేలా చర్యలు చేపడుతామన్నారు. అన్న ప్రసాదం భవనంలో భోజనం తయారు చేసేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతిలోని సైన్స్ సెంటర్ కు ఇచ్చిన 70 ఎకరాలల్లో 50 ఎకరాల వెనక్కి తీసుకోనున్నట్లు వెల్లడించారు. 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం(Devotional City) ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా తిరుమలలో సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన
'కరోనాకు ముందు ఏవిధంగా దర్శనాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తాం. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటిస్తాం. అన్నమయ్య మార్గాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం.
అటవీ శాఖ అనుమతులు వచ్చేలోపు తాత్కాలిక పనులు చేపడతాం. ప్రస్తుతం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా నడక దారిని ఏర్పాటు చేస్తాం. శ్రీవారి ఆలయం(Srivari Temple)లోని మహాద్వారం, ఆనందనిలయం, బంగారువాకిలిలో బంగారు(Gold) తాపడం చేయాలని నిర్ణయించాం. మహాద్వారానికి తాపడం పనులు త్వరలో మొదలుపెడతాం. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేసేందుకు ఆగమ సలహాలు తీసుకుంటాం. శ్రీనివాస సేతుకు నిర్మాణానికి ఇప్పటి వరకు టీటీడీ రూ.100 కోట్లు ఇచ్చింది. మరో రూ. 150 కోట్లు డిసెంబర్ లోపు మంజూరు చేస్తాం.' అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ ఏడాది బడ్జెట్ కు ఆమోదం
బాలాజీ జిల్లా(Balaji District)కు కలెక్టరేట్(Collectorate) గా పద్మావతి నిలయాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,096 కోట్ల బడ్జెట్ ఆమోదించామని తెలిపారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశామన్నారు. టీటీడీ డిపాజిట్లపై రూ.668 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొ్న్నారు. ఆర్జిత సేవల ధరలు పెంపు నిర్ణయం తీసుకోలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సిఫార్సు లేఖలపై ఇచ్చే సేవల ధరలు పెంచాలనే అంశం చర్చకు వచ్చిందన్నారు. దర్శన టిక్కెట్లు(Darshan Tickets) విక్రయంపై రూ.242 కోట్లు, ప్రసాదం విక్రయంపై రూ.365 కోట్లు, అద్దె గదులు, కళ్యాణ మండపాల ద్వారా రూ.95 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.126 కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ.120 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.